ఏమిటా ఉత్కంఠ… ఏమా ఎదురుచూపులు… దేశాన్నంతా ఏకతాటిపైకి నడిపించిన రోజు ఇది. కుల, మతాలకతీతంగా భారతావని… ఇది నాది అని సగర్వంగా మువ్వన్నెలను ముద్దాడిన రోజు. ఎవరో అక్కడకు వెళ్లి జాగ్రత్తగా మిషన్ ను ఉంచినట్లు ఎంత నిశిత పరిశీలన.. ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా కాలిడిన ఘడియ.. అమృత ఘడియగా మారింది. బుధవారం సాయంత్రం.. సరిగ్గా సమయం 5:44 గంటలు. అప్పుడు మొదలైంది… చంద్రుడిపైకి ల్యాండర్ 17 నిమిషాల చివరి మెట్టు. ల్యాండర్ చంద్రుడికి 150 మీటర్ల దగ్గరకు చేరుకునేసరికి అందరి నుంచి ఒకటే చప్పట్లు. ఇక జాబిల్లిని ముద్దాడటానికి మరో రెండు నిమిషాలే మిగిలింది. ఈ 120 సెకన్లలో ల్యాండర్.. పూర్తి తీక్షణతతో జాబిల్లి ఉపరితలాన్ని దీక్షగా అబ్జర్వ్ చేసింది. అలా మెల్లగా మెల్లగా సాయంత్రం 6:03 గంటలకు కాళ్లను దక్షిణ ధ్రువంపై ఉంచింది. ఇంకేముంది.. బెంగళూరు రీసెర్చ్ సెంటరే కాకుండా దేశవ్యాప్తంగా ఒకటే సంబరాలు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సగర్వంగా తలెత్తుకున్న రోజుగా నిలిచిపోయింది. చందమామపై దిగిన కొద్దిసేపటికే ల్యాండర్.. అక్కణ్నుంచి ఫొటోల్ని పంపించింది. ఇక రాత్రి 11 గంటలకు ల్యాండర్ బయటకు వచ్చినట్లు ఇస్రో ప్రకటించింది.
మనం ఏదైనా పని తలపెడితే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పాలనుకోం. ఎందుకంటే ఆ పని సక్సెస్ అవుతుందో లేదోనన్న అనుమానం. మరి మేం చేసిన పనిని సగర్వంగా దేశ పౌరులంతా చూడొచ్చని ఇచ్చిన మెసేజే ఇస్రో సైంటిస్టుల ఆత్మవిశ్వాసానికి ఆలంబన. చంద్రయాన్-3 గమనాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా స్టూడెంట్స్ చూడటం ఎంతో అవసరమని చెప్పినపుడే ఇస్రో(ISRO) ధైర్యం, స్థైర్యం అర్థమయ్యాయి. అయినా చివరి వరకు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ(Anxiety) ప్రజల్లో ఉందే కానీ సైంటిస్టుల్లో ఏ మాత్రం కనిపించలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… చంద్రయాన్-3 ల్యాండింగ్ కచ్చితత్వంపై ఇస్రోకు ఎంతటి నమ్మకముందో. అలాంటి నమ్మకాన్ని నిజం చేస్తూ విక్రమ్ ల్యాండర్ సగర్వంగా నెలరేడు దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. సౌత్ పోల్ పై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్(EU) స్పేస్ ఏజెన్సీలకు సాధ్యం కాని లక్ష్యాన్ని ISRO సుసాధ్యం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన ఖ్యాతిని పెంచుకుంటూ మన్ననలు అందుకుంది.
41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్.. జాబిలి సౌత్ పోల్ పై అడుగుపెట్టింది. జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్… 5 సార్లు కక్ష్యను పెంచుకుంటూ ముందుకు సాగింది. 15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి కొత్త పరిశోధనలకు ఊపిరిపోసింది భారతదేశం. తాజాగా చంద్రయాన్-3తో ఎవరికీ సాధ్యం కాని సౌత్ పోల్ జాడల్ని పుడమికి పంపించనుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్… 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై రీసెర్చ్ చేస్తాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం సౌతాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ.. చంద్రయాన్-3 యాత్రను పూర్తిగా వీక్షించారు. ల్యాండింగ్ పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఊపుతూ ఆనందాన్ని తెలియజేశారు. వెంటనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఫోన్ చేశారు. దేశం సాధించిన ఘనత పట్ల అందరినీ అభినందిస్తున్నానని, త్వరలోనే బెంగళూరు వచ్చి కలుసుకుంటానని చెప్పారు. ఇలాంటి చారిత్రక క్షణాలు దేశ గతిని అజరామరం చేస్తాయని, చరిత్ర క్రియేట్ చేసే ఇటువంటి ఘటనలు చూస్తే జన్మ ధన్యమవుతుందని భావోద్వేగాన్ని కనబరిచారు. మొత్తంగా ఇస్రో చేపట్టిన యాత్ర సక్సెస్ ఫుల్ కావడంతో.. ప్రతి ఒక్కరిలోనూ ఆనందం తాండవించింది.
Great ISRO &INDIA …
Well explained..