మనం ఏదైనా సాధించినపుడు మనకు మనమే ఆస్వాదించడం మనసుకు సాంత్వన.. అదే నలుగురితో పంచుకుంటే అదో ఆనందం.. కానీ చుట్టూ ఉన్నవారితో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే.. అంతకన్నా మించిందేమీ ఉండదు. ఇప్పుడు స్కూళ్లలో విద్యార్థులు సైతం అదే ఫీలింగ్ తో ఉన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తో ఇస్రో(ISRO)కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతుంటే.. సైంటిస్టుల ఘనతను చూసి మన దేశం ఉప్పొంగిపోతోంది. ఈ ప్రయోగం చిన్నారుల్లో మాత్రం విపరీతమైన ఆసక్తి(Interest)ని పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సుమధుర దృశ్యాన్ని అందరూ తిలకించాలని ముందుగానే ఇస్రో సూచించింది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ప్రయోగాన్ని వీక్షించడం ద్వారా స్ఫూర్తి పొందుతారని చెప్పడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయారు. అయితే ఎవరి ఇళ్లల్లో వారే దీన్ని చూడాల్సి రావడంతో నిన్న పిల్లలకు పెద్దగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కలగలేదు. అందుకే ఈ రోజు బడులు మొదలవ్వగానే ఇస్రో ప్రయోగం గురించే ముచ్చటించుకున్నారు. దేశం సాధించిన అరుదైన ఘనతను మాస్టార్లు… పిల్లలకు విడమరిచి చెప్పారు.
యూట్యూబ్ లో మళ్లీ ఆ ప్రయోగాన్ని చూపించారు. ల్యాండర్ అడుగుపెట్టిన తీరును యూట్యూబ్ లో మరోసారి చూస్తూ విద్యార్థులంతా పరవశానికి లోనయ్యారు. మన దేశం ఇంతటి ఘనత సాధించిందా అంటూ గర్వంగా చెప్పుకున్నారు. కొందరు పిల్లలు వినూత్న రీతిలో ఇస్రోకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ స్కూల్ విద్యార్థులు… ఇస్రో(ISRO) ఆకారంలో కూర్చుని సంతోషాన్ని పంచుకున్నారు. అటు భారతీయ పతాకాలు చేతబూని మాస్టార్లు.. దేశ ప్రగతిని వారికి విడమరిచి చెప్పారు. చిన్నారులంతా ఇలా దేశభక్తిని చాటడం అందరినీ ఆకట్టుకుంది.