ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు.. నిజాయతీ ఉంటే చేసే పనిని చిత్తశుద్ధితో పూర్తిచేయవచ్చు. ప్రతిభకు నిజాయతీ తోడైతే.. దాన్ని ఆపేవారెవరూ ఉండరు. టాలెంట్ కు ట్రాన్స్ పరెన్సీ లేకున్నా.. ట్రాన్స్ పరెన్సీకి టాలెంట్ జత కాకున్నా చేసేదేం ఉండదు. అందుకే చాలా విషయాల్లో, చాలా దేశాల్లో నిజమైన నైపుణ్యాలు బయటకి రావడం లేదు. కానీ గత వారంలో భారతదేశాన్ని చూస్తే అపార ప్రతిభా పాటవాలు మన సొంతమే అన్న చందంగా రెండు రంగాల్లో అనన్య సామాన్యమైన ప్రతిభను చూడగలిగాం. యాదృచ్ఛికంగా ఆ రెండింటి పేర్లూ ఇంచుమించు ఒకేలా ఉండటం మరింత విశేషంగా చెప్పుకోవాలి.
కలిసొచ్చిన ‘ప్రజ్ఞా’, ‘ప్రగ్యా’ నామాలు
‘ప్రజ్ఞా’.. ఇప్పుడీ పేరు వరల్డ్ వైడ్ గా అందరికీ చిరపరిచితం. ఇంటర్నేషనల్ లెవెల్లో భారత్ సాధించిన దిగ్విజయాల్లో ఈ పేరే సంచలనంగా మారింది. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఘనతను సొంతం చేసుకుంటే.. ఇక చెస్ రంగంలో ప్రపంచ యవనికపై భారత్ పతాకాన్ని రెపరెపలాడించిన చెన్నై చిన్నోడిది మరో క్రెడిట్. భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై నడయాడిన రోవర్ పేరు ‘ప్రగ్యాన్’ అయితే… చదరంగంలో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన కుర్రోడి పేరు ‘ప్రజ్ఞానంద’. మొత్తంగా ‘ప్రజ్ఞా’ అనే భావం స్ఫురించేలా వచ్చే నామం ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. నిజానికి గత కొద్ది కాలంగా భారతదేశం వివిధ రంగాల్లో అపార విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇంకా కొన్ని కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉన్నా.. భారత ప్రతిభా రంగం ఇప్పుడిప్పుడే సంచలనాలకు కేంద్ర బిందువుగా అవతరిస్తోంది.
రెండు ‘అపురూప’ ఘనతలే
మనం చెప్పుకుంటున్న రెండూ అపురూప ఘనతలే. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా వంటి టాప్-3 దేశాలకు సాధ్యం కాని సౌత్ పోల్ యాత్రను.. భారత్ సునాయాసంగా కంప్లీట్ చేసింది. పూర్తి కచ్చితత్వంతో, అనుకున్నది అనుకున్నట్లుగా సాగిన చంద్రయాన్-3 యాత్ర.. అంతరిక్ష రంగంలో ఇండియా ఘనతను చాటింది. సరైన ఆదరణ, ఎంకరేజ్ మెంట్ లేక విద్యావంతులు, సైంటిస్టులు అమెరికాకు వెళ్లిపోయేవారు. మనవాళ్ల ప్రతిభతోనే ఆ దేశం అద్భుత విజయాలు సాధించిందనేది అందరికీ తెలిసిందే. కానీ స్వదేశీ పరిజ్ఞానం స్ఫూర్తితో ఇప్పుడు ముందుకు సాగుతున్న తీరు.. భావి తరాలకు ఆదర్శప్రాయమవుతోంది. అందుకే ఇప్పుడు కొన్ని రంగాల్లో మనం విశేషంగా దూసుకుపోతున్నాం. ఇందుకు మెయిన్ ఎగ్జాంపులే… ఇస్రో(ISRO). అపార టాలెంట్ ఉన్నా కుటిల రాజకీయాల వల్ల ఎంతోమంది సైంటిస్టులు అదృశ్యమైన మన దేశంలో… ఇస్రోకు కల్పించిన అనధికార స్వతంత్ర ప్రతిపత్తి వల్ల గొప్ప గొప్ప ప్రయోగాలు చేయగలుగుతున్నాం. ఎప్పుడైనా ఇస్రోలో ఇంత పెద్ద స్థాయిలో సైంటిస్టుల్ని చూశామా..! చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో ఇస్రో హాల్ లు మొత్తం నిండిపోయాయి. ఇప్పుడక్కడ వెయ్యి మందికి పైగా సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇంత కంటే గొప్ప ఎగ్జాంపుల్ ను చూడగలమా.
‘ఆదరిస్తే’ అడ్డే ఉండదు
సరైన ఎంకరేజ్మెంట్ ఉంటే ఆ టాలెంట్ కు ఆకాశమే హద్దు. అందుకు కెన్యా లాంటి దేశాలే ఉదాహరణ. అథ్లెటిక్స్ లో ఆ దేశ ప్లేయర్లు సాధిస్తున్న విజయాల గురించి చెప్పేదేముంటుంది. అలాంటి టాలెంట్ మన దగ్గరా ఉంది. దాన్ని సరైన దిశలో పెట్టడమే లక్ష్యం కావాలి. ప్రతిదాన్నీ పాలిటిక్స్ పరంగా కాకుండా ప్రతిభ కోణంలోనే చూడాలి. చెన్నై చిన్నోడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద చూపిన నైపుణ్యం.. చెస్ రంగంలో సంచలనాలు రేపింది. వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ కే ముచ్చెమటలు పట్టించాడంటేనే ఎంతటి ప్రతిభాశాలో అర్థమవుతుంది. కొంచెంలో తప్పిపోయింది కానీ… వరల్డ్ ఛాంపియన్ గా అవతరించే వాడే. ఆయన ఈ స్థాయికి రావడానికి తన కుటుంబమే మెయిన్ రీజన్. వారే గనుక ప్రోత్సహించకుంటే ప్రజ్ఞానంద టాలెంట్ లోకానికి తెలిసేదే కాదు. అందుకే రాజకీయాల్ని పక్కనబెట్టి మేం మాత్రమే చేస్తున్నాం అనే డాంబికాల్ని వదిలేసి ప్రోత్సహిస్తే భారత్ కన్నా మించిన ప్రతిభ ఎక్కడా ఉండదు. ఇప్పుడు క్రికెట్ లోనూ అదే చూస్తున్నాం. యశస్వి జైస్వాల్, గిల్, రుతురాజ్, తిలక్ వర్మ లాంటి టాలెంట్ కలిగిన కుర్రాళ్లు.. అద్భుతంగా రాణిస్తున్నారు. చంద్రుడిపై కాలు పెట్టడానికి పడ్డ శ్రమ ఇంచుమించు ఓ పదేళ్లు. కానీ 60 ఏళ్లయినా ఆ ఘనతను అగ్రదేశాలు సాధించలేదంటే ఏమనుకోవాలి. అందుకే ప్రజ్ఞా పాటవాలున్నా సరైన దిశలో నడిపించడమే మనకు ప్రధానం కావాలి.