తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సొసైటీలో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయం వల్ల టీచర్లకు ఉద్యోగ భద్రత ఏర్పడిందని, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు, జనరల్ సెక్రటరీ ఎన్.దయాకర్ ఆనందం వ్యక్తం చేశారు. 2007 నుంచి ఇప్పటివరకు 16 సంవత్సరాల పాటు ఉద్యోగులు కాంట్రాక్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలోనూ వారు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అనే విధానానికి చరమగీతం పాడతానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి మాట నిలుపుకున్నారని అన్నారు. దీనిపై ఎంతో కాలంగా తమ సంఘం ప్రభుత్వానికి వివరించిందని, మనవిని మన్నించిన సీఎంకు కృతజ్ఞతలు అంటూ బాలరాజు, దయాకర్ సంతోషం వ్యక్తం చేశారు.
TSUTF నేతల ఆనందం
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను అటు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF స్వాగతించింది. హామీ ఇచ్చిన మేరకు ఇంతకాలానికి టీచర్లను రెగ్యులరైజ్ చేయడం మంచి పరిణామమంటూ CMకు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి… UTF అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవితోపాటు గురుకుల ఉపాధ్యాయుల విభాగం కన్వీనర్లు డి.ఎల్లయ్య, ఎస్.శ్రీజన, జి.రాంబాబు, పి.హరీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెగ్యులరైజేషన్ కోసం UTF ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేస్తూ.. మిగతా డిపార్ట్ మెంట్లలోనూ ఇదే తరహాలో రెగ్యులరైజ్ చేయాలని కోరారు.