ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇస్రోని చూసి గర్విస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇస్రో సైంటిస్టులను కలిసేందుకు బెంగళూరు చేరుకున్న ఆయన.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పొద్దున 6:30 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధానికి ఉన్నతాధికారులు, ఇస్రో ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కణ్నుంచి బయల్దేరిన మోదీని చూసేందుకు భారీ యెత్తున ప్రజలు, BJP నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. చందమామపై ల్యాండర్ దిగినపుడు తాను దక్షిణాఫ్రికాలో ఉన్నానని, ఆ అద్భుత క్షణాలను అక్కణ్నుంచే చూశానన్న మోదీ.. బెంగళూరు వెళ్లి సైంటిస్టుల్ని కలవాలని అప్పుడే డిసిషన్ తీసుకున్నానన్నారు. భారత్ కు వెళ్లగానే ముందుగా బెంగళూరులోనే అడుగు పెట్టాలనుకున్నానని, వైజ్ఞానిక రంగంలో భారత్ సాధించిన పురోగతి ప్రపంచాన్ని ఆనందానికి గురిచేసిందన్నారు. ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ అన్న నినాదాన్ని మోదీ ఇచ్చారు.
బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ భుజం తట్టి హగ్ చేసుకున్నారు. మిగతా సీనియర్ సైంటిస్టులు సైతం మోదీని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. చంద్రయాన్-3 ప్రయోగం తీరును సోమనాథ్.. PMకు వివరించారు. ఈ ఘనతలో పాలుపంచుకున్న ప్రతి సైంటిస్టుని మోదీ అభినందించారు. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చిన తీరు, ప్రస్తుతం అక్కణ్నుంచి అందుతున్న సంకేతాల గురించి తెలియజేశారు.
జాబిల్లి నుంచి అందిన తొలి ఇమేజ్ తో కూడిన ఫొటోను ప్రధాని మోదీకి సోమనాథ్ బహూకరించారు. అనంతరం మోదీ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ ఉందంటూ ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ చెయ్యెత్తి సెల్యూట్ చేశారు. చంద్రయాన్-3 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ఈ విజయం మీ అందరిదీ అంటూ ఇస్రో నిపుణుల్ని అభినందించారు. ఇస్రో సాధించింది సామాన్య విజయం కాదన్న ప్రధాని.. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు.