చిన్నపిల్లలు మారాం చేస్తుంటే చంద్రున్ని చూపిస్తూ తల్లులు అన్నం తినిపిస్తారు. చిన్నప్పుడు అంతలా కాపాడుకున్న తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని ఆలోచించారామె. జాబిల్లిని చూపించి గారాబం చేసిన విషయాల్ని తలచుకుంటూ అదే నెలరాజును అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే ఆలస్యం.. చంద్రుడిపై ల్యాండ్ కోసం వెంటనే డబ్బులు పే చేశారు. ఇదంతా చేసిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన మహిళే మరి. అమెరికాలో సెటిలైన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన సాయి విజ్ఞత.. గతడేది చంద్రుడిపై ఎకరం భూమి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. 2022 మార్చి 8న అమెరికాకు చెందిన లూనార్ పోర్టల్ లో అప్లయ్ చేసుకున్నారు.
చంద్రయాన్-3 అడుగుపెట్టిన నాడే…
అదేంటో కానీ చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ అడుగుపెట్టిన ఆగస్టు 23 నాడే సాయి విజ్ఞతకు డీల్ పేపర్స్ చేరుకున్నాయి. ‘మదర్స్ డే’ను పురస్కరించుకుని తల్లికి ఏదైనా ఇవ్వాలని ఆమె అనుకున్నారు. తొలుత తల్లి పేరిట మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె… ఆ తర్వాత తన కుమార్తె పేరును కూడా అందులో చేర్చారు. ఇలా ‘మదర్స్ డే’ పేరిట తన తల్లికి.. తల్లిగా తనకు అపురూప కానుకను ఇచ్చుకోగలిగారు. ల్యాండ్ కొనడం విశేషమైతే.. అది మన ప్రయోగం సక్సెస్ అయిన నాడే పేపర్లు ఇంటికి రావడం మరో ఆశ్చర్యకర పరిణామంగా నిలిచింది. ఇక వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.