చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ ద్వారా జోరు మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO.. త్వరలో చేపట్టనున్న’గగన్ యాన్’ ద్వారా మహిళా రోబోను నింగిలోకి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. స్వదేశీ టెక్నాలజీతో తయారైన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ద్వారా ‘వ్యోమిత్రా’ పేరు గల మహిళా రోబోను నింగిలోకి పంపుతారు. గతంలోనే ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావించినా కొవిడ్ ప్రభావంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెకెక్కిస్తుండగా.. వచ్చే అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ‘గగన్ యాన్’ను ప్రయోగిస్తామని జితేంద్ర సింగ్ NDTVకి తెలిపారు. అచ్చంగా మనుషుల మాదిరిగానే కార్యకలాపాలు(Activities) కొనసాగించే ‘వ్యోమిత్రా’ను.. అన్నీ అనుకూలిస్తే ఆకాశంలోకి పంపుతామన్నారు.
‘గగన్ యాన్’ ప్రోగ్రాంకు గాను రెండో క్రూ మాడ్యుల్ నిర్మాణ ప్రక్రియ పూర్తయి దాన్ని ఇస్రోకు అందజేశారు. ఇక ఆర్బిటర్ మాడ్యుల్ కూడా కంప్లీట్ కావడంతో టెస్ట్ వెహికిల్ మిషన్ ప్రయోగించే లాంచ్ ప్యాడ్ పనులు జరుగుతున్నాయి. ఇస్రో 2024 లేదా 2025లో ప్రయోగించాలని భావించిన మానవ సహిత మిషన్ కు ముందు ఈ ‘వ్యోమిత్రా’ రోబోను రోదసిలోకి పంపుతోంది. ‘వ్యోమిత్రా’ను మోసుకెళ్లే రెండు అన్ క్రూడ్ మిషన్ లను స్టార్ట్ చేస్తోంది. మానవ సహిత యాత్ర చేపడితే అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది.