ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన ఫొటోలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని క్రమంగా బయటకు తీసుకువస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. కేరళ తిరువనంతపురంలోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న సోమనాథ్.. సైన్స్, ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి ఉందన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలకు వెళ్లే సత్తా భారత్ కు ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమన్నారు. తద్వారా అంతరిక్ష రంగంతోపాటు దేశం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు.
కచ్చితత్వంతో చంద్రుని టెంపరేచర్
చంద్రునిపై కచ్చితత్వంతో కూడిన టెంపరేచర్ ను విక్రమ్ ల్యాండర్.. ఇస్రోకు పంపింది. జాబిల్లి ఉపరితలం, ఉపరితలానికి సమీపంలో, ఉపరితలం లోపల ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయన్న విషయాల్ని ఇస్రో షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ లో ఉన్న చాస్టే పేలోడ్ ద్వారా ఈ శాస్త్రీయ డేటాను సేకరించింది. మైనస్ 10 నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలిపింది.