పుట్టింది పేద రైతు కుటుంబం. చిన్నప్పుడే 80 కేజీల బరువు. బల్లెం విసరడమా.. మెడ తిప్పడమే కష్టంగా ఉంటే. అతడి బరువు చూసి తోటి పిల్లలు నవ్వుతూ ఉండేవారు. ఇలా ఇంటా బయటా ఒకటే అవహేళన. కానీ తండ్రి ప్రోద్బలంతో బరిటె పట్టిన అతడు పట్టువదలని విక్రమార్కుడిలా తయారై ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. శ్రమ, పట్టుదల, అంకితభావం కలిస్తే నీరజ్ చోప్రా. 1997 డిసెంబరు 24న హరియాణాలోని పానిపట్ జిల్లా ఖంద్రా అనే గ్రామంలో పుట్టాడు. తండ్రి వ్యవసాయ పనులు చేస్తుండగా… నీరజ్ కు ఇద్దరు సోదరీమణులున్నారు. ఎక్కువ బరువు గల ఈ చిన్నోడు.. తండ్రి బలవంతంతో పానిపట్ లోని శివాజీ స్టేడియం జిమ్ కు వెళ్లాడు. అక్కడే చోప్రాకు జావెలిన్ త్రోపై ఇష్టం ఏర్పడింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాయ్ లో తండ్రి జాయిన్ చేస్తే ఎలాంటి ట్రెయినింగ్ లేకుండానే బల్లేన్ని 40 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. గాజియాబాద్ కు చెందిన జావెలిన్ త్రోయర్ అక్షయ్ చౌధురి… ఫస్ట్ టైమ్ 40 మీటర్లు విసిరిన నీరజ్ ను దగ్గర్నుంచి గమనించాడు. అలా 13 ఏళ్ల వయసులోనే పంచకులలోని తావ్ దేవిలాల్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో జాయిన్ అయ్యాడు. క్రమంగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాడు. జావెలిన్ త్రో ద్వారానే తానేంటో నిరూపించాలనుకున్నాడు.
ఆ తర్వాత జైవీర్ అనే ట్రెయినర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. 2012 అక్టోబరులో లఖ్ నవూలో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ కు అదే ఫస్ట్ మెడల్. 2016లో ప్రపంచ అండర్-20 ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2021 టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. ఒలింపిక్స్ లో ఇండియా తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ప్లేయర్ గా 26 ఏళ్ల ఈ కుర్రాడు రికార్డ్ సృష్టించాడు. 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో సెకండ్ ప్లేస్, అదే ఏడాది స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరిగిన డైమండ్ లీగ్ లో 89.94 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఇదే ఇప్పటివరకు అతడి టాప్ త్రో గా నిలిచింది.
తన పదహారేళ్ల ప్రాయంలో 2013లో తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లో రంగంలోకి దిగగా.. ఉక్రెయిన్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ తో కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాతి ఏడాదికే 2014లో బ్యాంకాక్ లో యూత్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అదే ఏడాది సీనియన్ నేషనల్స్ లో 70 మీటర్లు విసిరాడు. చిన్నవయసులోనే భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును నీరజ్ చోప్రా 2021లో అందుకున్నాడు. ఇక 2018లో అర్జున అవార్డు, 2022లో పద్మశ్రీ పురస్కారాలు దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఆసియా అథ్లెటిక్ గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఆర్మీలోని రాజ్ పుతానా రైఫిల్స్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ JCOగా విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నీరజ్ చోప్రా.. ఎన్నో అవమానాలు ఎదురైనా వాటిని అడ్డుగోడలుగా భావించకుండా భారత అత్యున్నత క్రీడాకారుడిగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.