PHOTO: THE TIMES OF INDIA
ఆ విమానం బయల్దేరి సరిగ్గా అరగంట అయింది. కానీ అప్పుడే ఓ విషాదకర ఘటన ఏర్పడింది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రాణాలు ఇక గాలిలో ఉన్నట్లే తయారైంది. ఆ పసిపాపకు ఒక్కసారిగా శ్వాస అందకుండా పోవడం… శరీరమంతా బ్లూ కలర్ లోకి మారడంతో పరిస్థితి కష్టంగా మారింది. కానీ ఆ సమయంలోనే విమానంలో అద్భుతం జరిగింది. ఆ చిన్నారి పాలిట దేవుళ్లలా ఐదుగురు డాక్టర్లు ప్రత్యక్షమయ్యారు. వారు మామూలు డాక్టర్లు కాదు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థలో పనిచేస్తుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విభాగంలో నిపుణులు. ఆ ఐదుగురూ కలిసి చివరకు పాపను ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో చోటుచేసుకుంది. ఫ్లైట్ బయల్దేరిన అరగంట తర్వాత గాల్లో ఉండగానే చిన్నారి ఆరోగ్యం విషమంగా మారింది. దీనిపై ఎయిర్ హోస్టెస్ సమాచారంతో పైలెట్లు అప్రమత్తమై పాప కండిషన్ గురించి అనౌన్స్ చేశారు. ఇంకేముంది.. అందులోనే ఉన్న ఐదుగురు డాక్టర్లు పరుగు పరుగున పాప వద్దకు చేరుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
ఏ దైవమో కలిపిన బంధమేమో.. ఆ చిన్నారిని కాపాడటానికే వచ్చారా అన్నట్లుంది ఆ డాక్టర్ల ట్రీట్మెంట్. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)కు చెందిన నలుగురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కాగా… మరొకరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ కు చెందిన డాక్టర్ ఆ విమానంలోనే ఉన్నారు. నాడీ సంబంధిత వ్యాధులకు సంబంధించి బెంగళూరులో రెండు రోజుల కాన్ఫరెన్స్ కు హాజరైన ఈ డాక్టర్లు.. విస్తారా ఫ్లైట్ లో ఢిల్లీకి రిటర్న్ జర్నీ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లోనే అనౌన్స్ వినపడటంతో ఈ డాక్టర్లు పాప వద్దకు చేరుకుని ఫ్లైట్ లోని ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ తో వైద్యమందించారు. నోరు కదలకపోవడం, తల గట్టిగా మారడంతో వెంటనే ఆక్సిజన్ తో కూడిన వెంటిలేషన్ అందించారు. ఆక్సిజన్ అందించే మాస్క్ ఫెసిలిటీ లేకపోవడంతో మామూలుగా పెద్దలు వాడే ఫేస్ మాస్క్ నే అందుకు ఉపయోగించారు. ఈ ఫేస్ మాస్క్ ను అప్పటికప్పుడు సిలిండర్లకు బిగించి ఆక్సిజన్ వచ్చేలా చేశారు. ఛెస్ట్ కంప్రెషన్ ను అదుపులో ఉంచుతూ, గుండెకు శ్వాస ఆడేలా చేస్తూ ప్రతి ఐదు నిమిషాలకోసారి ECGని పరీక్షించారు.
కంటిన్యూగా ఇచ్చిన CPRతో 45 నిమిషాల తర్వాత పాజిటివిటీ కనపడింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు దగ్గర్లో ఉన్న నాగ్ పూర్ ATCని పైలట్ సంప్రదించారు. మరో 20 నిమిషాల్లో నాగ్ పూర్ చేరుకుంటామన్న టైమ్ లో పైలట్ కు ATC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే ఆ ఫ్లైట్ ను నాగ్ పూర్ లో రాత్రి 10:30కు ల్యాండ్ చేయగానే అప్పటికే రెడీగా ఉన్న పిల్లల డాక్టర్లు పాపకు ట్రీట్మెంట్ అందించి హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. UK-814 నంబరు గల ఫ్లైట్ బెంగళూరులో రాత్రి 9 గంటలకు బయల్దేరగా.. 11:45కు ఢిల్లీ చేరాల్సి ఉంది. పాపకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ల పొజిషన్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. నిజంగా ఆ పాప కోసమే వారంతా వచ్చారా అన్నట్లుంది వాతావరణం. ఆ ఐదుగురిలో అనస్థీషియా, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, లివర్ ఎక్స్ పర్ట్స్ ఉన్నారు. పాప ప్రాణాలు కాపాడిన డాక్టర్లను అందరూ అభినందించారు.