ఏడాది కాలంగా పెద్దగా మార్పు లేకుండా ఉన్న పెట్రోలు(Petrol), డీజిల్(Diesel) ధరలపై కేంద్రం కన్ను పడిందా.. వచ్చే ఎలక్షన్ల దృష్ట్యా వాటిని తగ్గించే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ రూ.200 తగ్గిన దృష్ట్యా పెట్రోలు, డీజిల్ రేట్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాహనాల ఇంధన ధరలు తగ్గితే అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు దిగి వస్తాయి. దీనివల్ల రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతుల(Exports)పై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో వస్తువుల రేట్స్ తగ్గాలంటే కీలక చర్యలు తీసుకోవాలన్న భావన కేంద్రంలో కనపడుతోందని అంటున్నారు. అందులో భాగంగానే తాజాగా వంట గ్యాస్ పై భారీగా తగ్గింపులు చేశారు.
ఇప్పుడు బియ్యం వంటి వాటిపై నిషేధం విధించడంతో ఇది దేశానికి సానుకూల పరిణామంగా మారనుందన్న మాటలు వినపడుతున్నాయి. దీనికి పెట్రో ధరలు తోడయితే ద్రవ్యోల్బణం దిగివస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం ఎన్నికలు… వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఈ ధరలు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న కోణంలోనూ కేంద్రం పెట్రో ధరలు తగ్గించాలని చూస్తున్నదని నిపుణులు అంటున్నారు.