
పార్లమెంటు సమావేశాలను మరో ఐదు రోజుల పాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ అమృత్ కాల్ సమావేశాలు(Meetings) ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. 17వ లోక్ సభకు ఇది 13వ సెషన్ కాగా.. ఈసారి ఫలవంతమైన చర్చలు సాగుతాయని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు మంత్రి అన్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ ఉన్నందున అప్పటివరకు ఇందుకు సంబంధించిన అజెండాకు రూపకల్పన జరిగే అవకాశం కనిపించట్లేదు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. పొలిటికల్ పార్టీల్లో హీట్ ను పెంచేలా ఉంది. గత నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన సంగతి తెలిసిందే.
మాన్ సూన్ సీజన్లో అత్యధిక సమయం పరస్పర ఆరోపణలకే గడచిపోయింది. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, చర్చిద్దామన్న విపక్షాలు రావడం లేదంటూ NDA సర్కారు ఎదురుదాడికి దిగడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఇండియా కూటమి సభ్యులు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో గత సమావేశాలు అసలైన చర్చ లేకుండానే అర్థంతరంగా ముగిశాయి. ఇప్పుడు మరోసారి పార్లమెంటు సమావేశాలు పెడుతుండటంతో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.