
అక్రమంగా నివసిస్తున్న శరణార్థుల బిల్డింగ్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగి 73 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలు కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమ నిర్మాణంగా భావించి కరెంట్, వాటర్ ను ప్రభుత్వం నిలిపివేసిన బిల్డింగ్ లో శరణార్థులు నివాసం ఉంటున్నారు. శరణార్థుల కుటుంబాలు చిన్న చిన్న స్టౌలపైనే వంటలు చేసుకుంటూ కాలం గడుపుతున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. జోహన్నెస్ బర్గ్ లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని ఐదు అంతస్తుల భవనంలో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. బిల్డింగ్ అంతా భీకరమైన పొగలు అలుముకోవడంతో ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసు అధికారులు.. పలువురిని సురక్షితంగా బయటకు తేగలిగారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ బిల్డింగ్ లో 200 మంది ఉన్నట్లు సౌతాఫ్రికా అధికారులు అంటున్నారు. సెక్యూరిటీ గేట్ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా దానికి లాక్ వేయడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దక్షిణాఫ్రికాలోనే ఇది అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఒకటని ఆ దేశ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల్లో చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.