ఆగస్టు మొత్తానికే ముఖం చాటేసిన వర్షాలు.. మళ్లీ రాబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి వారం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఇప్పటికైనా వర్షాలు వస్తాయన్న సమాచారంతో రైతుల్లో ఆశలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలను పరిశీలిస్తే గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో వర్షపాత లోటు(Rainfall Deficit) ఉందని తెలిపింది. ఈ నెల తొలి రోజు నుంచే మళ్లీ నైరుతి రుతుపవనాలు పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని IMD తెలిపింది. కుండపోతగా కురిసిన వానలతో జులై చివరి వారం వరకు ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా ఆ తర్వాత నెల రోజులు అంటే ఆగస్టు నెల మొత్తం వరకు ఒక్కసారి కూడా గట్టి వర్షం పడలేదు.
రాష్ట్రంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా పంటలపై పెట్టిన పెట్టుబడులన్నీ వృథా అయిపోయాయి. దీంతో కర్షకులు భారీగా నష్టపోవడమే కాకుండా ఇప్పటివరకు పంటలు మొలకెత్తే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబరు మొదటి వారమంతా వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు ఆవర్తనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కేంద్రీకృతమైంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 4న మరో ఆవర్తనం ఏర్పడుతున్నదని IMD తెలిపింది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని ప్రకటించింది.