కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అంశంపై కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్రం ఈ రకంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తరచూ ఎలక్షన్లు నిర్వహిస్తుండటంతో సమయం, డబ్బు వృథా అవుతూ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. జమిలి ఎన్నికలను తెరమీదకు తెచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సార్లు మధ్యలోనే ప్రభుత్వాలు కూలిపోవడంతో ప్రతి చోటా ఏటా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఎన్నికల నిర్వహణకు భారీ ఖర్చుతోపాటు సమయం వేస్ట్ కావడంపై ‘లా కమిషన్ ఇప్పటికే ఎక్సర్ సైజ్ చేసి నివేదిక రూపొందించింది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎదురయ్యే రాజ్యాంగపరమైన చిక్కుల్ని తొలగించాల్సి ఉంటుంది. లోక్ సభను రద్దు చేసే అధికారాల్ని రాష్ట్రపతికి కల్పించిన ఆర్టికల్ 83ని సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356 అధికరణాలను సవరించాల్సి ఉంటుంది. ‘వన్ నేషన్’-‘వన్ ఎలక్షన్’ను అమలు చేయాలంటే ఈ 5 ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ‘లా కమిషన్’ సిఫారసుల మేరకు ముందుకెళ్లాలని కేంద్ర సర్కారు డిసైడ్ అయింది. దీని ప్రకారమే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని వేసింది. అయితే దీన్ని అమలు చేయాలంటే అన్ని పార్టీల నుంచి పూర్తిస్థాయిలో అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అన్నిపార్టీల ప్రెసిడెంట్లతో ప్రధాని మీటింగ్ నిర్వహించగా… అందుకు అందరూ సమ్మతి తెలిపారు. అయితే దీనిపై మరోసారి అందరి నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ‘లా కమిషన్’తోపాటు న్యాయ నిపుణుల అభిప్రాయాల్ని తీసుకోవాల్సి ఉంటుందన్న కోణంలో చర్చ సాగింది.
ఎన్నికలు, ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ పేరిట ఏటా వేల కోట్లు ఖర్చవుతున్నాయి. 1952, 1957, 1962, 1967 సమయాల్లో అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఏకకాలంలో ఎలక్షన్లు జరిగాయి. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు అంటే పార్లమెంటులో ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో.. తాజాగా అనూహ్య రీతిలో మీటింగ్స్ ఏర్పాటు చేయడం అందుకేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే దీన్ని తీసుకువస్తారా అన్న మాటలు వినపడుతున్నాయి. లోక్ సభ రద్దుకే ఈ మీటింగ్స్ నిర్వహించబోతున్నారా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎలక్షన్ల కన్నా ముందే జమిలి ఎన్నికలపై ఒక క్లారిటీ ఇచ్చేలా కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.