దాడిలో పట్టుబడినదాన్ని బట్టి ఇప్పటిదాకా కేవలం డ్రగ్స్ సప్లయ్ మాత్రమేనని భావించారు. కానీ లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు గుట్టంతా బయటపడుతోంది. హైదరాబాద్ మాదాపూర్ అపార్ట్ మెంట్ లో పోలీసులకు పట్టుబడ్డ కేసులో.. నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్, ఛీటింగ్, వ్యభిచారం, సినిమాల పేరుతో వల, అధికారినంటూ మోసాలు ఇలా… ఒకటేమిటి కుప్పలు తెప్పలుగా వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. ఆగస్టు 31న పోలీసులు జరిపిన రైడ్స్ లో భాగంగా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. సినీ ఫైనాన్షియర్ అయిన వెంకటరత్నారెడ్డి లీలలు మామూలుగా లేవని తేల్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులున్నాయని, ఇప్పటికే ఇద్దరు ప్రొడ్యూసర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు.
నిందితుల సెల్ ఫోన్లపై దృష్టిపెట్టిన యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ పోలీసుల బృందం… మత్తు పదార్థాల కేసులో లింక్స్ పై ఆరా తీస్తున్నారు. వీళ్లే కాకుండా ఈ సప్లయర్స్ లో ఇంకా ఎవరెవరున్నారు.. వాటిని ఎవరికి సేల్స్ చేస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. వెంకటరత్నారెడ్డి అరేంజ్ చేసే రేవ్ పార్టీలకు ఏయే వ్యక్తులు అటెండ్ అవుతున్నారన్న కోణంలో కూలంకష ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మరోవైపు సినిమాల్లో అవకాశాలిస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్ని రప్పించి వారితో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.