‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’ కోసం రామ్ నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే BJP అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా.. మాజీ రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఆయనతో భేటీ అయి వివిధ అంశాలను నడ్డా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీ అనుసరించబోయే విధానాలపై ఇంకా ప్రకటన వెలువడకున్నా కోవింద్ ను నడ్డా కలుసుకోవడం కమిటీ పురోగతిపైనే ఉంటుందన్న భావన కనపడుతోంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అమలు చేయాలంటే రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ ను సవరించడం, కొన్నింటిని రద్దు చేయడం వంటివి జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అయితేనే కరెక్ట్ అన్న తీరుగా రామ్ నాథ్ కోవింద్ కు బాధ్యతలు అప్పజెపుతున్నారు. ఈ కమిటీకి నేతృత్వం వహించడానికి కోవింద్ సమ్మతించారా.. ఇందులో ఇంకా ఎవరెవరు సభ్యులుంటారు.. ఈ కమిటీ విధివిధానాలు ఏమిటి అన్న విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనపడుతున్నది.
ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో NDA సర్కారు అనుసరించే విధానాలు.. ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’ అంశాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలన్నీ కోవింద్-నడ్డా భేటీలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి భేటీ వివరాలు బయటకు వస్తేనే ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’ అంశం ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది.