చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ ప్రయాణంతో హుషారుగా ఉన్న ఇస్రో.. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. సౌర తుపాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు కలికే అంతరాయాలపై ప్రయోగాలు జరగనున్నాయి. ఆదిత్య-ఎల్ 1 రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO నేడు నింగిలోకి పంపుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఏడు పేలోడ్ లను మోసుకెళ్లే మిషన్ ను పంపుతోంది. దేశవ్యాప్తంగా గల వివిధ సంస్థలు చేయూతనందించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ ను తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 ద్వారా వ్యోమనౌకను ఉదయం 11:50 గంటలకు ప్రయోగిస్తారు.
తొలుత ఆదిత్య-ఎల్ 1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి ఆదిత్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు ఈ ఉపగ్రహానికి 125 రోజుల టైమ్ పడుతుంది. లగ్రాంజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమాంతరంగా ఉంటుంది. ఈ సానుకూలత వల్ల అక్కడ ఎక్కువ కాలం రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఆదిత్య-ఎల్ 1 లో ఏడు పేలోడ్ లు ఉంటాయని ఇస్రో ప్రకటించింది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్, ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్, ఎక్స్ పరిమెంట్, ప్లాస్మా అనలైజన్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్ -1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ వంటి 7 పేలోడ్ ల ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది.