భారత సంతతికి చెందిన వ్యక్తులు దేశాల అధినేతలుగా కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. గతంలో రెండో ప్రాధాన్య పదవుల(Second Cadre)కే పరిమితమైతే నేడు దేశ బాధ్యతల్ని మోసే అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నారు. భారతదేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ గడ్డను ఏలుతున్న రిషి సునాక్ మన సంతితి వాడే కాగా.. తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగ రత్నం అక్కడి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. షణ్ముగ రత్నం విజయాన్ని సింగపూర్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించింది. ఇద్దరు చైనా సంతతి వాసుల్ని ఓడించి మరీ భారీ తేడాతో షణ్ముగ గెలుపు సాధించారు. ప్రస్తుత ప్రెసిడెంట్ హలీమా యాకుబ్ పదవీకాలం ఈ నెల 13తో కంప్లీట్ అవుతుంది. సింగపూర్ కు 9వ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ధర్మన్ షణ్ముగ రత్నం.. 2011 నుంచి 2019 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా సేవలందించారు. 2019-23 కాలంలో కేబినెట్ లో పనిచేశారు. ప్రముఖ ఎకనమిస్ట్ గా గుర్తింపు పొందిన షణ్ముగ.. సింగపూర్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో జన్మించారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టా పొందిన షణ్ముగ.. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, హార్వర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీలు అందుకున్నారు. ధర్మన్ షణ్ముగ రత్నం కన్నా ముందు గతంలో సింగపూర్ కు ఇద్దరు భారత సంతతీయులు అధ్యక్షులుగా పనిచేశారు. తమిళ సంతతికి చెందిన సెల్లప్పన్ రామనాథన్ 12 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక మలయాళీ సంతతి వాసి చెంగర వీటిల్ దేవన్ నాయర్ ఆ దేశానికి రెండో భారతీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ధర్మన్ షణ్ముగ రత్నంతో ఆ సంఖ్య మూడుకు చేరుకున్నట్లయింది.