జమిలి ఎన్నికలు(ఒకే దేశం ఒకే ఎన్నికలు) తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో 8 మంది నియమితులయ్యారు. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ప్రకటించగా.. అందులో సభ్యుల పేర్లను కూడా కేంద్రం వెల్లడించింది. రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా గల కమిటీలో మరో ఏడుగురిని నియమిస్తూ పేర్లను ప్రకటించారు. రాజకీయ, శాసన, న్యాయ విభాగాల్లో సుప్రసిద్దులుగా పేరుపొందిన వ్యక్తులను ఈ కమిటీకి సెలెక్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ N.K.సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వేలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ గెజిట్ రిలీజ్ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్ర ఉంటారు. తక్షణమే కమిటీ పని స్టార్ట్ చేయాలని, వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని న్యాయ శాఖ ఆదేశించింది.
దేశంలో తరచూ ఎలక్షన్లు నిర్వహిస్తుండటంతో సమయం, డబ్బు వృథా అవుతూ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా.. ఈ జమిలి ఎన్నికల విధానాన్ని మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సార్లు మధ్యలోనే ప్రభుత్వాలు కూలిపోవడంతో ప్రతి చోటా ఏటా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఎన్నికల నిర్వహణకు భారీ ఖర్చుతోపాటు సమయం వేస్ట్ కావడంపై ‘లా కమిషన్ ఇప్పటికే ఎక్సర్ సైజ్ చేసి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం జమిలి ఎన్నికలపై మోదీ తరచూ ప్రస్తావన తీసుకువస్తున్నారు.