
ఏడు నెలల కాలంగా ఎదురుచూపులకే పరిమితమైన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఇక ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. సెప్టెంబరు 3న(ఈ రోజు) ప్రారంభమయ్యే ప్రక్రియ అక్టోబరు మూడో వారం వరకు కొనసాగనుంది. ఎలాంటి గందరగోళం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఆ దిశగా పలు తేదీల్లో వెబ్ ఆప్షన్లు, బదిలీలు, ప్రమోషన్లతో కూడిన షెడ్యూల్ కు అధికారులు రూపకల్పన చేశారు. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్(Online) అప్లికేషన్లు స్వీకరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సెప్టెంబరు 1ని సర్వీస్ కు కటాఫ్ గా విద్యాశాఖ నిర్ణయించింది. నిబంధనల్లో భాగంగా ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. నేటి నుంచి మూడేళ్ల లోపు రిటైర్ కానున్న HMలు, టీచర్లను ట్రాన్స్ ఫర్స్ కు పరిగణలోకి తీసుకోరు. కనీసం రెండేళ్ల కాలంగా పనిచేస్తున్న HMలు, టీచర్లు.. బదిలీ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ట్రాన్స్ ఫర్స్ కోసం గతంలో అప్లయ్ చేసుకోని టీచర్లు, HMలు ఈ నెల 3 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
సీనియారిటీ లిస్ట్ పై 8, 9 తేదీల్లో అందరి నుంచి అభ్యంతరాలు తీసుకుంటారు. ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెడ్ మాస్టర్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వనుండగా.. 15న వారి బదిలీలు ఉండనున్నాయి. 17 నుంచి 19వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చేలా కార్యాచరణ తయారు చేశారు. 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.. 23, 24 తేదీల్లో ట్రాన్స్ ఫర్స్ ఉంటాయి. 26 నుంచి 28 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత రోజు నుంచి అంటే 29వ తేదీ నుంచి అక్టోబరు 1 వరకు SGTల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇస్తారు. అక్టోబరు 3న SGTల ట్రాన్స్ ఫర్స్ ఉంటాయి. అక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పిస్తోంది.