టికెట్ల పరిశీలనలో బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. ఇప్పటికైనా అభ్యర్థుల లెక్కలు కొలిక్కి వస్తాయా అన్న సందేహం కనపడుతోంది. పెద్దయెత్తున పోటీ నెలకొనడం… ప్రతి నియోజకవర్గంలోనూ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టికెట్ల కేటాయింపు కత్తి మీద సాములా తయారైందన్న మాటలు వినపడుతున్నాయి. ఇక అధికార BRS మాదిరిగానే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో సీనియర్ లీడర్లే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. కొత్తగా చేర్చుకున్న వారితో తమ పరువు గంగలో కలిసిపోతోందని, మరి మాకు ఇచ్చే విలువా ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డితోపాటు పలువురు లీడర్లు కాంగ్రెస్ లో చేరడంతో వివాదం రాజుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నేతల మధ్యే వివాదం రాజుకోవడం.. నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు మండిపడటం వంటివి తలనొప్పిగా తయారయ్యాయి. తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి వంటి వారికి రాజకీయ ఆశ్రయం కల్పించిన వ్యక్తిగా నాగం జనార్దన్ రెడ్డికి పేరుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఒక్క మహబూబ్ నగరే కాదు, ఉమ్మడి వరంగల్, నల్గొండ సహా పలు జిల్లాల్లోనూ ఇదే తీరు నెలకొంది. ఇలాంటి అసందిగ్ధ, ఆధిపత్య పరిస్థితుల్లోనే యాదాద్రి భువనగిరి జిల్లా DCC అధ్యక్షుడిగా పనిచేసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. భువనగిరి MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పొసగక పార్టీ నుంచే వెళ్లిపోయారు. అటు పొన్నాల లక్ష్మయ్య వ్యవహారంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సీనియర్లను ఉంచాలా, తుంచాలా…?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లది ఎప్పుడూ డామినేషనే. ఆ విషయంలో ఎలాంటి అపనమ్మకాలు ఉండవన్నమాట శ్రేణుల్లోనే కనిపిస్తుంటుంది. ఇపుడున్న లీడర్లలో ఎక్కువ మంది సీట్లు దక్కించుకునేది ఈ సీనియర్లే అయి ఉంటారు. రాష్ట్ర పార్టీలో ప్రెసిడెంట్లు మారినా కొందరి స్థానాలకు ఢోకా ఉండదు. ఇంచుమించు మొత్తం సీట్లలో సగం సీట్ల దాకా ఈ సీనియర్లదే ఆధిపత్యం ఉంటుంది. ఇక పార్టీనే నమ్ముకుని పనిచేసే వారు సైతం ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్నారు. మరోవైపు ఎన్నికల టైమ్ లోనే పార్టీలో చేరేవారు కచ్చితంగా టికెట్ల కోసమే వస్తారన్నది కాదనలేని వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిచ్చే టికెట్లు ఎలా ఉంటాయన్నది అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఎక్కడ తేడా వచ్చినా అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. BRSకు దీటుగా టికెట్లు ఇద్దామనుకున్న పరిస్థితుల్లో ఎలాంటి తేడా కనిపించినా అదే అధికార పార్టీకి ప్లస్ పాయింట్ గా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మరి కొత్త ప్రెసిడెంట్ నాయకత్వంలో యువతరానికి టికెట్లు దక్కుతాయా.. యథాలాపంగా తలపండిన లీడర్లకే చోటు దక్కుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక నియోజకవర్గాలను ప్రభావితం చేసే కొందరు ఇతర పార్టీల లీడర్లు క్రమంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ తరహా లీడర్లకు సైతం టికెట్లు కట్టబెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో సీనియర్లను ఉంచుతారా, కొందరిని తుంచుతారా అన్న వాదనలు వినపడుతున్నాయి.
సాయంత్రం ఎన్నికల కమిటీ భేటీ
టికెట్ల కేటాయింపును కొలిక్కి తెచ్చే దిశగా ఇప్పటికే సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ.. ఈరోజు మరోసారి భేటీ కానుంది. గాంధీభవన్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ PEC మీటింగ్.. ఛైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుండగా 1,006 అప్లికేషన్లను పరిశీలిస్తారు. స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే రిపోర్ట్ ను ఈ మీటింగ్ లోనే ఫైనలైజ్ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు పేర్లతో తొలుత షార్ట్ లిస్ట్ చేయాలని కమిటీ భావిస్తున్నట్లు కనపడుతోంది. PEC ఇచ్చే ఈ రిపోర్ట్ ను రేపటి(ఈనెల 4) నుంచి మూడు రోజుల పాటు పీఈసీ సభ్యులతోపాటు DCC ప్రెసిడెంట్లు, సీనియర్లతో విడివిడిగా స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది.