పాపం.. ఆ చిన్నోడు. అనుకోకుండా నాలాలో పడిపోయాడు. నాలా నుంచి కాల్వలో కొట్టుకుపోతుండగా కొంతమంది చూశారు. ఒకతను చేయి పట్టుకుని పైకి తీసుకురావాలని చూసినా.. అందిన చెయ్యే అందినట్టు జారిపోయింది. కానీ వారంతా అక్కడున్న నీటి ఉద్ధృతిని చూసి అందులోకి దూకే సాహసం చేయలేకపోయారు. దీంతో కళ్ల ముందే ఆ చిన్నారి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇంతటి దయనీయ గాథ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఎక్కడ నాలాలున్నాయో.. ఎప్పుడు అవి నోరు తెరిచి ఉంటాయోనన్నది భాగ్యనగరంలో అంతుచిక్కని విధంగా తయారైంది. పాపం.. ఆ పసివాడు ఆడుకోవడానికి ఇంటి గేటు నుంచి బయట అడుగుపెట్టగానే నాలాలో పడిపోయాడు. నాలుగేళ్ల మిథున్ అనే చిన్నారి కొట్టుకుపోయిన విషాద ఘటన ప్రగతి నగర్ NRI కాలనీలో జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో బాలుడు బయటకు రాగానే ఇంటి ముందున్న నాలాలో ఒక్కసారిగా పడిపోయాడు. కాసేపటికే చిన్నోడి గురించి తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికారు. కానీ ఎక్కడా జాడ కనిపించకపోవడంతో నాలాలో పడిపోయాడని గుర్తించారు. స్థానికులే గాలించి బాలుణ్ని గుర్తించినా ప్రాణాలు కాపాడలేని పరిస్థితి ఏర్పడగా, చివరకు రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో బాలుణ్ని గుర్తించగలిగారు.
ఆరు గంటల పాటు గాలింపు తర్వాత బాబు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ప్రగతి నగర్ తురక చెరువు నుంచి DRF బృందాలు మిథున్ మృతదేహాన్ని బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగించాయి. నిన్న గాంధీనగర్ లో ఓ మహిళ అదృశ్యం కాగా.. ఆమె కూడా నాలాలో పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇలా రెండు రోజుల్లో వరుసగా రెండు దుర్ఘటనలు జరగడం మహా నగరంలో విషాదాన్ని నింపాయి. అభం శుభం ఎరుగని పిల్లాడు అకస్మాత్తుగా కళ్లముందే అందరూ చూస్తుండగానే ప్రాణాలు విడవడం అత్యంత విషాదాన్ని నింపింది. ఆ వార్త విన్నవాళ్లందరినీ ఆవేదనకు గురిచేసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకోవడం హృదయ విదారక పరిస్థితికి అద్దం పట్టింది.