
కుండపోత వర్షాలు.. నోరు తెరుచుకున్న నాలాలు.. ప్రాజెక్టుల నుంచి రిలీజవుతున్న వాటర్ తో బ్రిడ్జిల మూసివేత.. ఇవీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు. ఇలాంటి వాతావరణంలో హైదరాబాద్ లో ఉండే ప్రజలే బయటకు రావొద్దంటూ GHMC ప్రకటించింది. అందుకే హైదరాబాద్ రావాలనుకునే ఇతర ప్రాంతాల వాసులు భాగ్యనగర జర్నీని వాయిదా వేసుకుంటేనే మంచిది. మెట్రో సిటీకి వచ్చి తిప్పలు పడటమే తప్ప అడుగు బయటపెట్టే అవకాశమే లేదు. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో కార్లు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. మోటార్ సైకిళ్లు కొట్టుకుపోతున్నాయంటే వరద ఉద్ధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంటిన్యూగా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న దృష్ట్యా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మినహాయిస్తే ఇప్పుడిప్పుడే జంట నగరాలకు రాకపోవడమే మంచింది. GHMC శివారు ప్రాంతాల్లో మాత్రమే అంతోఇంతో రాకపోకలకు అనువైన వాతావరణం ఉంటోంది. అది కూడా ఒక శివారు నుంచి మరో శివారుకు వెళ్లాలంటే ఔటర్ రింగ్ రోడ్డు ORR మినహా.. సిటీని నమ్ముకుంటే కష్టమేనని యంత్రాంగం చెప్పకనే చెబుతున్నది.
మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
ఈ రోజు రాత్రి నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండటంతో మూసారాంబాగ్ వద్ద వాటర్ ఫ్లో బాగా పెరిగింది. కాబట్టి ఈ వంతెన పై నుంచి రాకపోకలు ఆగిపోతాయి. ఒక్క మూసారాంబాగే కాదు ఇంచుమించు హైదరాబాద్ లోని అన్ని మెయిన్ ఏరియాల్లోనూ ఇదే తీరు కనపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు పైగా రెయిన్ ఫాల్ రికార్డవడం కూడా వర్షపు నీరు భారీగా నిలిచిపోడానికి కారణంగా నిలిచింది.