ఆరోపణలు, ప్రత్యారోపణలు.. నువ్వా, నేనా అన్నట్లు సాగే ఆధిపత్య ధోరణితో ఎప్పుడూ గందరగోళంగా కనపడే గద్వాల రాజకీయం.. మరోసారి సందిగ్ధతతో కనిపిస్తున్నది. అధికారిక MLA ఒకరైతే.. కోర్టు తీర్పుతో MLAగా మారినవారు మరొకరు. ఇలా అత్త, అల్లుడి మధ్య కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యం.. ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మూడు సార్లు గెలిచిన చరిత్ర ఒకరిదైతే.. పట్టువదలని విక్రమార్కుడిలా విజయయాత్రకు బ్రేక్ వేసిన హిస్టరీ మరొకరిది. ఇద్దరిదీ ఒకే కుటుంబమైనా ఏనాడూ ఆ ఛాయల్లో కనిపించని సదరు నియోజకవర్గ నేతలు.. ఇప్పుడు MLA పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. 2018 ఎలక్షన్లలో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(BRS) గెలుపొందారు. కాంగ్రెస్ కు చెందిన DK అరుణపై 28,445 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. BKMRకు 52.60 శాతంతో 1,00,057 ఓట్లు రాగా.. అరుణకు 37.64 శాతంతో 71,612 ఓట్లు వచ్చాయి. 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి హస్తం పార్టీలో చేరిన DK.. 2009, 2014 విజయాలతో హ్యాట్రిక్ సాధించారు.
గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారంటూ 2019లో అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. తాజాగా BKMRను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి గద్వాల రాజకీయం గరం గరంగా తయారైంది. అధికారికంగా గెలిచానంటూ ఒకరు.. కోర్టు చెప్పింది కాబట్టే నాదే విజయమంటూ మరొకరు.. ఇలా ఇద్దరు లీడర్ల మధ్య అగ్గి రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాల మేరకు ఎలక్షన్ గెజిట్లో DK అరుణ పేరును MLAగా చేర్చారు. దీనిపై సుప్రీంకు వెళ్లేందుకు బండ్ల.. మూడు రోజుల్నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావును సైతం అనర్హుడిగా ప్రకటిస్తే సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు BKMR విషయంలో ఏం తేలుతుందన్నది చూడాల్సి ఉంది. లీడర్ల పరిస్థితి ఇలా ఉంటే ప్రజల్లో భిన్నమైన చర్చ నడుస్తున్నది. ఇప్పుడు అసలు MLA ఎవరు…? రాజకీయాల గురించి ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో ఏనాడూ లేకున్నా గద్వాల ఆధిపత్య పోరుపైనే అందరి దృష్టీ ఉంటుంది. అలాంటిదే మరోసారి కనిపించడంతో ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.
ఇప్పుడు రెండు, మూడు అంశాలే నియోజకవర్గ వ్యాప్తంగా వినపడుతున్నాయి. BKMRపై నిజంగానే వేటుపడితే నిబంధనల ప్రకారం వచ్చే ఎలక్షన్లకు దూరమవుతారా.. అరుణను MLAగా ప్రకటించినా ఆమె ఇప్పుడు కాంగ్రెస్ కాదు కదా, పార్టీ మారడం కూడా రూల్స్ కు విరుద్ధమే, అలా అయితే ఆమె MLAగా ఉంటారా… కాంగ్రెస్ లీడర్ గా ఓట్లు వేశారు కానీ BJPకి కాదుగా.. అన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. BKMR ఆశ్రయిస్తే గనక ఇక ఎవరు ఏంటన్నది తేల్చాల్చింది సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషనే. కొత్తగూడెం, గద్వాల సెగ్మెంట్లకు ఒకటే తేడా ఉంది. అక్కడ పేరు మార్పు ప్రకటించకముందే సుప్రీం నుంచి స్టే వచ్చింది. ఇక్కడ సుప్రీంకు వెళ్లేలోపే పేరు మార్పు జరిగిపోయింది. అంటే గెజిట్ ప్రింట్ అయినట్టే లెక్క. ఇక నియోజకవర్గ MLAగా అత్తనా, అల్లుడా అన్న చర్చ తీవ్రంగా నడుస్తున్నది. అరుణ భర్త భరతసింహారెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి మేనల్లుడు కావడంతో.. తీర్పు ఎటు వచ్చినా ఆ కుటుంబం నుంచే MLA ఉంటారు కదా అన్న మాటలూ వినపడుతున్నాయి.
అతి కొద్దికాలంలోనే ఎలక్షన్లు రాబోతుండగా.. అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ రావొచ్చు. ఇప్పటికే BKMR పేరును BRS ప్రకటించగా.. అరుణ విషయంలోనూ BJP పెద్ద ఇంపార్టెన్సే ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలపై దృష్టిపెట్టాల్సిన సమయంలో ఇలా కోర్టులు, EC చుట్టూ లీడర్లు తిరగాల్సి వస్తోంది. నేతల పరిస్థితి, ప్రజల ఆలోచనా తీరు ఇలా ఉంటే.. ఇక అధికార యంత్రాంగంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఎవరికి ప్రొటోకాల్ ఇవ్వాలి.. ఎవరిని MLAగా భావించాలి.. అటు చూస్తే కోర్టు, EC ఆదేశాలు.. ఇటు చూస్తే ప్రెజెంట్ MLA.. అన్న భావన అధికారుల్లో కనపడుతున్నది. అసలే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముుకు కోపం అన్న వాతావరణం ఉండే ‘నడిగడ్డ’ రాజకీయాల్లో… తాజా సంకట స్థితి అందరిలోనూ యాంగ్జయిటీని తెచ్చింది.