కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన ఉత్సవాలకు అటెండ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు ఆయన వస్తున్నారు. రాష్ట్రంలో ఉత్సవాలు నిర్వహించాలంటూ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ BJP.. కేసీఆర్ సర్కారును పట్టుబడుతూనే ఉంది. ఏటా విమోచన దినోత్సవం నాడు నిరసన కార్యక్రమాలకు దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రికి వెల్ కమ్ పలకాలని నిర్ణయించిన రాష్ట్ర కమిటీ.. ఈ మేరకు అమిత్ షా కార్యాలయానికి సమాచారం అందజేసింది. రాష్ట్ర పార్టీ ఆశించిన విధంగా కార్యక్రమానికి వచ్చేందుకు షా సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇక ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేయాలన్న ఆలోచనలో లీడర్లున్నారు.
రేపు పార్టీ పదాధికారుల భేటీ
సెప్టెంబరు 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన వేడుకలతోపాటు తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలించేందుకు కమలం పార్టీ పదాధికారుల సమావేశం రేపు జరగనుంది. 17న అమిత్ షా వస్తున్నందున ఏర్పాట్లు భారీగా ఉండేలా కార్యాచరణతోపాటు అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తయారీపై ఈ పదాధికారుల మీటింగ్ లో చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికలకు అనుసరించే విధానాలను కూడా ఇందులో మాట్లాడతారని పార్టీ నేతలు అంటున్నారు.