ఎంతలో ఎంత మార్పు. రైతుల దగ్గర పంట లేనప్పుడు ఆకాశాన్నంటిన ధరలు.. ఇప్పుడు పంట చేతికి వచ్చిన దశలో బేల చూపులు చూస్తున్నాయి. అంగట్లో ప్రస్తుతం కిలో టమాట(Tomato) 3 రూపాయలు పలుకుతున్నదంటేనే ఎంతటి దయనీయ పరిస్థితులున్నాయో అర్థమవుతుంది. మొన్నటి వరకు రూ.250 కన్నా ఎక్కువకు పలికిన రేటు.. చివరకు ఈరోజు దీనస్థితికి పడిపోయింది. పండించిన పంటనంతా రైతులు రోడ్లపై పారబోసి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా డోన్, మదనపల్లె, ప్యాపిలి మార్కెట్లలో భారీస్థాయిలో ధరలు పతనమయ్యాయి.
ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఎక్కడికక్కడే వాటిని వదిలేస్తూ సాగుదారులు ఆవేదనలో ఉన్నారు. 20 కిలోల బరువుండే బాక్స్ రూ.60కి అమ్ముడుపోయింది. ఆటో ఖర్చులకే ఒక్కో బాక్స్ కు రూ.20 అవుతున్నది. అటే అది పోను మిగిలేది కిలోకు రూ.2 రూపాయలే. ఇక విత్తనాలు, ఎరువులు ఇతర పెట్టుబడుల్ని చూస్తే అసలుకే ఎసరు వస్తున్నది.