తెలంగాణ అధికారుల కన్నా పుదుచ్చేరి అధికారులే తనకు అమితమైన గౌరవం ఇస్తున్నారని రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలందిస్తున్న తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘పుదుచ్చేరిలో చీఫ్ సెక్రటరీ(CS) సహా చాలా మందిని కోఆర్డినేట్ చేస్తున్నా.. అక్కడ అందరూ గవర్నర్ తో బాగుంటారు.. కానీ ఇక్కడ మాత్రం జిల్లాలకు వెళ్తే అధికారులే రారు’ అని తమిళిసై గుర్తు చేశారు. తెలుగులో మాట్లాడిన ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్ భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘కాఫీ టేబుల్ బుక్’ను రిలీజ్ చేసిన గవర్నర్.. సవాళ్లకు, ప్రతిబంధకాలకు భయపడబోనని, ప్రొటోకాల్ రూల్స్ కో లేదా కోర్టుల వల్లో తనను కట్టడి చేయలేరని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా విధుల్ని, బాధ్యతల్ని నిర్వహించడానికి సవాళ్లు ఎదుర్కొంటానని గుర్తు చేశారు.
పుదుచ్చేరిలో CSతోపాటు 20 మంది IASలతో పనిచేస్తున్నానని తెలియజేశారు. ఎలాంటి కన్నింగ్ నేచర్ లేకుండా పనిచేసుకుపోవడమే తన ప్రధాన ఉద్దేశమని, ఇందుకోసం ఎంతటి రిస్క్ నైనా ఎదుర్కొంటానన్నారు. పాలిటిక్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, పేదల కోసమే పనిచేసుకుంటూ రాజ్యాంగ బద్ధ పదవిని కాపాడుతున్నానని గుర్తు చేశారు.