ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Bypolls)లో BJP సత్తా చాటింది. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. మరో నాలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 7 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఏడింటిలో మూడు BJPకే దక్కాయి. అయితే పశ్చిమ్ బెంగాల్ లో మాత్రం BJPకి చుక్కెదురు కాగా ఆ పార్టీ స్థానాన్ని TMC చేజిక్కించుకుంది. సెప్టెంబరు 5న పోలింగ్ జరగ్గా.. ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి. ఉత్తరాఖండ్-బాగేశ్వర్, ఉత్తర్ ప్రదేశ్-ఘోసీ, కేరళ-పుత్తుపల్లి, పశ్చిమబెంగాల్-ధుప్ గురి, జార్ఖండ్-డుమ్రి, త్రిపురలోని బాక్సానగర్, ధన్ పుర్ సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగాయి. అధికార NDA, విపక్ష INDIA కూటమికి ఈ ఎన్నికలు రెఫరెండంగా మారాయి.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో కమలం పార్టీ సత్తా చాటింది. కమ్యూనిస్టుల కంచుకోటల్ని బద్ధలు కొడుతూ ఎన్నికలు జరిగిన రెండింటికి రెండు స్థానాల్లో విజయఢంకా మోగించింది. BJP అభ్యర్థి తఫజ్జల్ హుస్సేన్.. 66 శాతం మైనార్టీ ఓట్లున్న బాక్సానగర్ నుంచి అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి మిజాన్ హుస్సేన్ కు దారుణ పరాభవం ఎదురైంది. BJPకి చెందిన తఫజ్జల్ కు వచ్చిన ఓట్లలో ప్రధాన ప్రత్యర్థి అయిన CPI(M) క్యాండిడేట్ మిజాన్ కు అందులో 15 శాతం ఓట్లు కూడా రాకపోవడం సంచలనంగా మారింది. ఇక్కడ BJPకి 30,237 ఓట్లు వస్తే CPI(M) కేవలం 3,909 మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ధన్ పూర్ లోనూ కమలం పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ నుంచి BJP క్యాండిడేట్ పార్వతీ దాస్ విజయం సాధించారు. ఆమె వరుసగా రెండోసారి అక్కణ్నుంచి గెలుపొంది స్థానాన్ని నిలుపుకొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్ పై 2,400 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. పార్వతికి 33,247 రాగా.. బసంత్ కుమార్ 30,842 ఓట్లు పోలయ్యాయి.
పశ్చిమ్ బెంగాల్ లో కమలం పార్టీకి ఓటమి ఎదురైంది. నార్త్ బెంగాల్ లోని ధుగ్ పురి స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్(TMC) అభ్యర్థి 4,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఘోసిలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
జార్ఖండ్ లోని డుమ్రి స్థానం నుంచి JMM అభ్యర్థి బేబి దేవి 17,000 ఓట్లతో AJSU-P’sకు చెందిన యశోద దేవిని ఓడించారు. JMM-కాంగ్రెస్-RJD-ఇండియా బ్లాక్ కూటమికి చెందిన బేబి దేవి.. తన భర్త మరణంతో అదే స్థానంలో పోటీకి దిగారు. హేమంత్ సోరెన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన జగన్నాథ్ మెహతో అకాల మరణంతో ఆయన సతీమణి బేబి.. డుమ్రి నుంచి పోటీకి దిగి BJP అభ్యర్థిపై విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కేరళలో అధికార LDFకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కూటమి UDFకు చెందిన చాందీ ఊమెన్ పుత్తుపల్లి సీటు నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి ఊమెన్ చాందీ 50 ఏళ్ల పాటు MLAగా కొనసాగి ఈ మధ్యనే కన్నుమూశారు. 37 ఏళ్ల చాందీ ఊమెన్ 37,719 ఓట్ల భారీ తేడాతో CPI(M)కు చెందిన జాక్ సి థామస్ పై గెలుపొందారు
పార్టీల వారీగా వచ్చిన సీట్లు
త్రిపుర BJP(2 స్థానాలు)
ఉత్తరాఖండ్ BJP
జార్ఖండ్ JMM
కేరళ UDF
పశ్చిమ్ బెంగాల్ TMC
ఉత్తర్ ప్రదేశ్ SP(లీడ్)