ఇప్పటికే ఒక మ్యాచ్ వర్షార్పణమైంది.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మ్యాచ్ జరగక కోట్లాది మంది నిరాశకు గురయ్యారు.. కానీ ఇది జరిగిన వారం తర్వాత మరో వన్డేకు దాయాది దేశాలు సిద్ధమయ్యాయి.. మరి అలాంటి మ్యాచ్ కు ఎంత ఉత్కంఠ ఉంటుంది.. ఈ ఆటను చూసేందుకు ఎంతగా పోటీ ఉంటుంది.. అలాంటి మ్యాచ్ ఇవాళ జరగాల్సి ఉన్నా దీనికీ వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ చెబుతున్నది. ఒకవేళ అంతా సవ్యంగా సాగితే మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలవుతుంది. ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 పోరులో భారత్-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. కొలంబో పిచ్ బౌలర్లకు అనుకూలం అని ప్రకటించడంతో మరి ఇరుజట్ల పేసర్లు, స్పిన్నర్లు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో పాక్ బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలవగా.. మిడిలార్డర్ లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఇలా అందరూ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మరి ఈ మ్యాచ్ లోనైనా వీరు ఎలా ఆడతారోనన్న ఉత్కంఠ ఏర్పడింది.
పాక్ త్రయం వెరీ డేంజరస్
ప్రస్తుత పాక్ బౌలర్లను చూస్తే వరల్డ్ లోనే అత్యంత ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక భారత్ తో మ్యాచ్ అంటేనే దాయాది ప్లేయర్స్ పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇస్తారు. ఆసియా కప్ తొలి మ్యాచ్ లో జరిగింది ఇదే. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ త్రయం.. అద్భుతమైన బాల్స్ తో బెంబేలెత్తిస్తున్నది. ఈ ముగ్గురూ పోటాపోటీగా వేస్తున్న ఓవర్లతో భారత బ్యాటర్లు డిఫెన్స్ ఆటను కనబరుస్తున్నారు. అసలే బౌలింగ్ పిచ్ అని చెప్పడంతో ఇక ఈ ముగ్గురూ తమ ప్రతాపాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు. మరోవైపు స్పిన్నర్లకు స్వర్గధామంగా చెబుతున్న పిచ్ పై ఇరుజట్ల స్పిన్నర్లు ప్రతాపం చూపే అవకాశముంది. అందుకే ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్, మిడిలార్డర్ గట్టిగా నిలబడి రన్స్ చేయాల్సి ఉంటుంది. 250 రన్స్ చేయడమే ఈ పిచ్ పై కష్టం అని లెక్కలు చెబుతుంటే… మరి భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. అటు బ్యాటింగ్ లోనూ పాక్ గట్టిగానే కనిపిస్తున్నది.