చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు AP హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా దీనిపై వాదనలు వినిపిస్తున్నారు. ACB కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని వాదించడంతోపాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యేవరకు ACB కోర్టులో విచారణ ఆపాలని కోరుతున్నారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, IPC 409 చెల్లవని క్వాష్ పిటిషన్ లో ఇప్పటికే పేర్కొన్నారు. సాక్ష్యాలు లేకున్నా రాజకీయ ప్రతీకారంతోనే కేసులు పెట్టారని తెలియజేసిన బాబు తరఫు లాయర్లు.. జ్యుడీషియల్ రిమాండ్ విధించడం సరికాదని వాదిస్తున్నారు. అటు ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(AAG) పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. చంద్రబాబు MLA కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోలేదని, ఇది చట్టవిరుద్ధమని లాయర్ లూథ్రా టీమ్ వాదించనుంది.
జైలులో అర్థరాత్రి తనిఖీలు
రాజమండ్రి సెంట్రల్ జైలును రీజినల్ జైల్ DIG రవికిరణ్ పరిశీలించారు. కారాగారంలో అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ తోపాటు పరిసర బ్యారక్ ల వద్ద ఈ తనిఖీలు కొనసాగాయి. అర్థరాత్రి దాటిన తర్వాత DIG అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చంద్రబాబు ఉన్న బ్యారక్ వద్ద 4+1తో భద్రతను మోహరించారు. తన భర్తకు సెక్యూరిటీ లేదని నిన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆరోపించారు. ఈ పరిణామాల దృష్ట్యా ఉన్నతాధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.