కేవీపీ రామచంద్రరావుతో అంటకాగుతూ రాష్ట్రాన్ని KCR తాకట్టు పెడుతున్నారని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ పిల్లల్ని పొట్టనబెట్టుకుని ఆంధ్రా నాయకులు, అధికారులతో కేసీఆర్ కుమ్మక్కువుతున్నారని, మీ కుటుంబమంతా మా కాలి గోటికి సరిపోదు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ విజయభేరి సన్నాహకంలో భాగంగా హన్మకొండలో నిర్వహించిన సమావేశానికి ఆయన అటెండ్ అయ్యారు. KVP రామచంద్రరావు చెప్పారని IPS గజరావ్ భూపాల్ ను రాష్ట్రానికి రప్పించారన్న రేవంత్.. మన తెలంగాణలో IPSలు లేరా అని మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ప్రగతి భవన్ అని చెప్పుకునే కేసీఆర్… దాన్ని కూడా చిన్నజీయర్ స్వామితో ప్రారంభించడం తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని మంటగలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్పుడైనా KVPతో మాట్లాడటం చూశారా అంటూ సభకు హాజరైన వారిని అడిగారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీకి గౌరవం ఇవ్వాలంటే ఆమె అటెండ్ అయ్యే సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.