విపత్తులు(Disaster)తోపాటు సముద్ర తీర ప్రాంతాల రక్షణ కోసం యూజ్ చేసే C-295 రవాణా విమానం భారత్ అమ్ములపొదిలో చేరింది. తొలి ఫ్లైట్ ను స్పెయిన్ లోని సెవిల్లెలో జరిగిన కార్యక్రమంలో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అందుకున్నారు. హోం మంత్రిత్వ శాఖతోపాటు తీర ప్రాంతాల గస్తీ, నేవీకి ఉపయోగించేందుకు గాను భారత్ మొత్తం 56 ఫ్లైట్స్ కి ఆర్డర్ ఇచ్చింది. అందులో తొలి విమానం బుధవారం(సెప్టెంబరు 13న) స్వీకరించగా.. మిగతా 55 ఫేజ్ ల వారీగా ఇక్కడకు రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ అయిన ఎయిర్ బస్ మనకు అందించేలా గతంలోనే ఒప్పందం కుదిరింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఫ్యూచర్ లో భారత త్రివిధ దళాలకు ఎంతో మేలు చేస్తాయని చౌధురి అన్నారు. తొలి 16 ఫ్లైట్స్ ని భారత్ సహకారంతో సెవిల్లెలో తయారు చేయనున్న ఎయిర్ బస్.. 17వ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి తయారీని భారత్ లో చేపట్టనుంది. ఇది దేశ ప్రగతికి ఎంతో ముందడుగని ఉన్నతాధికారులు అంటున్నారు. 56 విమానాల్లో 16 స్పెయిన్ లో మిగతా 40 భారత్ లో తయారీ కానుండగా.. టాటా, ఎయిర్ బస్ జాయింట్ వెంచర్ గా గుజరాత్ వడోదరలోని ప్లాంట్ లో వీటి ప్రొడక్షన్ చేపడతారు. రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులో భాగంగా చేపట్టే ఈ ప్లాంటుకు గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు.
ప్రైవేటు కన్సార్షియంతో భారత్ లో తయారు చేసే తొలి ఎయిర్ క్రాఫ్ట్ ఇదే అవుతుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది నవంబరు కల్లా వడోదర ప్లాంటులో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. స్పెయిన్ లో తయారయ్యే మరో 15 విమానాలు 2024 చివరికల్లా మనకు అందనున్నాయి. మన దేశంలో తయారయ్యే మిగతా 40 ఎయిర్ క్రాఫ్ట్స్ 2031లో సైన్యంలో చేరతాయి. ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ అయితే C-295 తయారు చేసే పలు దేశాల సరసన భారత్ నిలుస్తుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, చైనా, ఇటలీ, ఉక్రెయిన్, స్పెయిన్, జపాన్, బ్రెజిల్ ఉన్న లిస్టులో భారత్ చేరుతుంది. C-295 రాకతో ఇప్పటికే వైమానిక దళంలో ఎవ్రో-748 విమానాల్ని క్రమంగా తగ్గిస్తారు. 2023-2031 మధ్యలో ఫేజ్ ల వారీగా వీటిని చైనా, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో మోహరిస్తారు.