జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు(Terrorists) దారుణానికి తెగబడ్డారు. ఆర్మీ కర్నల్, మేజర్ తోపాటు కశ్మీర్ పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన DSPని పొట్టనబెట్టుకున్నారు. అనంత్ నాగ్ జిల్లా కోకర్ నాగ్ ప్రాంతంలో సైన్యానికి, ఉగ్రవాదులకు భారీ ఎదురుకాల్పులు జరిగాయి. గడోల్ ఏరియాలో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ ను మంగళవారం నాడు భారత సైన్యం చేపట్టింది. కోకర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో విస్తృత సోదాలు నిర్వహిస్తున్న టైమ్ లో… ముష్కరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మిలిటెంట్ల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ వీరమరణం పొందారు. తన దళాన్ని ముందుండి నడిపిస్తున్న ఆర్మీ కర్నల్(Colonel)తోపాటు DSPపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. హాస్పిటల్ కు తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నిషేధిత పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తొయిబా పనే అయి ఉంటుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాజౌరి సెక్టార్ లోని నార్ల ఏరియాలో మంగళవారం నాడు సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమవగా.. పాకిస్థాన్ ఆనవాళ్లతో కూడిన మెడిసిన్ తదితర ఆధారాలు వారి వద్ద లభించాయి.