వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగాలని భావిస్తున్న ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు సీట్ల పంపకంపై దృష్టి సారించాయి. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ తెలిపారు. ఇండియా అలయెన్స్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం.. బుధవారం శరద్ పవార్ నివాసంలో జరిగింది. ఈ భేటీకి 12 పార్టీలకు చెందిన సభ్యులు అటెండ్ కాగా.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ బెనర్జీకి ED సమన్ల కారణంగా ఆయన దూరంగా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉమ్మడి బహిరంగసభలు నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు.
అక్టోబరు ఫస్ట్ వీక్ లో భోపాల్ లో మొదటి బహిరంగసభను పెట్టుకోవాలని తీర్మానించారు. కుల గణన అంశంపై చర్చించాలన్న నిర్ణయంపై పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ కూటమి సభ్య పార్టీలు ఇప్పటివరకు మూడు సార్లు సమావేశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో అధికార BJPకి చెక్ పెట్టాలన్న ఏకైక ధ్యేయంతోనే ముందుకెళ్లాలన్న టార్గెట్ అన్ని పార్టీల్లోనూ కనపడుతున్నా.. సీట్ల పంపకాల్లో ముందడుగు పడటంపైనే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.