నిరుద్యోగ యువతను KCR సర్కారు చిన్నచూపు చూస్తూ ఉద్యోగాలు అనేవే లేకుండా చేస్తున్నదంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన నిర్వహించింది. నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద.. ఆ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి 24 గంటల నిరాహారదీక్షకు దిగారు. అయితే సాయంత్రం ఆరింటి వరకే పర్మిషన్ అంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. రాత్రి ఎనిమిదింటికి కిషన్ రెడ్డిని నాంపల్లిలోని BJP ఆఫీసుకు తరలించారు. బలవంతంగా తరలించే ప్రయత్నంలో పోలీసులు, కమలం పార్టీ కార్యకర్తలకు గొడవ జరిగింది. పెద్దయెత్తున తోపులాట జరిగి పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం గాయాలై సొమ్మసిల్లి పడిపోయారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోరాటం అలాగే కొనసాగించాలని జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డితో అన్నారు. అయితే ప్రభుత్వ తీరుపై అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది.
దీక్షను భగ్నం చేయడంపై మండిపడుతూ నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు BJP పిలుపునిచ్చింది. బలవంతంగా కిషన్ రెడ్డిని వాహనంలో ఎక్కిస్తుండగా పార్టీ శ్రేణులు అడ్డుకుని సర్కారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నాంపల్లిలోని ఆఫీసులో కిషన్ రెడ్డిని వదిలిపెట్టిన తర్వాత అక్కడే ఆయన దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. తోపులాటలో కిషన్ రెడ్డి ఛాతికి, చేతికి గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించి ట్రీట్ మెంట్ అందించారు. పోలీసుల తీరుపై ఫైర్ అయిన బండి సంజయ్.. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించారు.