ఒక టోర్నమెంట్ లో దాయాది దేశాలు ఒకసారి తలపడితేనే ఎంతో హంగామా ఉంటుంది. అలాంటిది రెండు లేదా మూడు సార్లు పోటీ పడితే ఇక అంతకన్నా మజా ఏముంటుంది. మరీ ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ గురించి తెలియనివారికి కూడా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే రెండుసార్లు తలపడ్డ ఈ ఇరుజట్లు.. మూడోసారి తలపడేది లేనిది ఇవాళ్టి మ్యాచ్ తో తేలిపోనుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన సమయంలో ఆసియా కప్ సూపర్-4లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక-పాకిస్థాన్ నేడు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ నిర్ణయాన్ని బట్టే మరోసారి భారత్-పాక్ పోరు జరుగుతుందా లేదా అనేది తేలిపోనుంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంకనే ఫేవరేట్ అని విశ్లేషకులు అంటున్నారు. సొంతగడ్డపై ఆడుతుండటం, స్పిన్ బలం శ్రీలంకకు కలిసి రానుండగా.. ఇద్దరు కీలక బౌలర్లు గాయాలతో మ్యాచ్ కు దూరమవడం పాకిస్థాన్ పాలిట శాపంగా మారింది. నసీమ్ షా, హారిస్ రవూఫ్ భారత్ తో మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ కే రాలేదు. దీంతో ఆ ఇద్దరినీ తర్వాతి మ్యాచ్ లకు దూరంగా ఉంచుతున్నట్లు పాక్ టీమ్ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
మరోవైపు వెల్లలగె 14.66 సగటుతో టోర్నీలో ఇప్పటికే 9 వికెట్లు తీసుకున్నాడు. భారత్ తో మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో ఈ చిన్నోడు అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ లో పాక్ ఎలా రాణిస్తుందన్నది క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే ఈ పోరులో గెలిచినవారే తుది మెట్టు(Final)కు చేరుకుంటారు. భారత్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ తేడాతో ఘోరంగా ఓడిపోగా.. అందుకు భిన్నంగా టీమ్ ఇండియాను లంక ఓడించినంత పనిచేయడం ఇంట్రెస్టింగ్ ని తలపించిది. ఈ ఇద్దరిలో గెలిచినవారు ఆదివారం జరిగే ఫైనల్ లో భారత్ తో తలపడతారు. రెండింటికి రెండు మ్యాచ్ లు గెలిచిన రోహిత్ సేన 4 పాయింట్లతో ఉండగా.. ఒక గెలుపు, మరో ఓటమితో శ్రీలంక, పాక్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. రెండింటికి రెండు ఓడి బంగ్లాదేశ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.