తెలంగాణ మలి దశ ఉద్యమంలో వారి పాత్ర అమోఘం.. అనిర్వచనీయం. అంతలా పోరాటం చేసి.. ఉద్యోగాలను వదిలేసి.. రోడ్లపైకి వచ్చి.. బస్సుల్ని బంద్ చేసి.. ఒకరకంగా రాష్ట్రం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. అలాంటి సిబ్బంది రాష్ట్రం ఏర్పాడ్డాక తమ కోరికలు నెరవేరడం లేదంటూ ఎంతోకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగుల కన్నా ఎక్కువగా నష్టపోయింది తామేనన్న ఆవేదన.. RTC ఉద్యోగుల్లో ఉండిపోయింది. కానీ ఇన్నేళ్లకు వారి కోరిక నెరవేరింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలుపుకోగా.. ఆ ఆశలకు వారధిగా గవర్నర్ నిలిచారు. ఎట్టకేలకు ఆర్టీసీ సిబ్బంది ఆశల్ని నిజం చేస్తూ రాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. సంస్థ సిబ్బందిని ప్రభుత్వ సేవల్లోకి తీసుకునే బిల్లు-2023పై తమిళిసై సౌందరరాజన్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఉద్యోగుల ప్రాతినిధ్యం, కార్పొరేషన్ సంక్షేమంపై ఇప్పటికే ప్రభుత్వంతోపాటు న్యాయశాఖ వివరణ కోరిన గవర్నర్… ఆ రెండు నివేదికలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ బిల్లును ఆమోదించినట్లు రాజ్ భవన్ ప్రకటించింది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు ఆమె అభినందనలు తెలిపారు.
ఉద్యోగుల్లో హర్షం
గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల ఇంతటి ఉదార వైఖరిని కనబరిచిన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో అనుమానాలన్నీ తీర్చాకే గవర్నర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో తొలుత కావాలనే ఆపుతున్నారన్న భావనతో సిబ్బంది అంతా ఆందోళన బాట పట్టారు. కానీ జరిగిన పరిణామాలు గుర్తించిన తర్వాత ఆమె పట్ల పాజిటివ్ దృక్పథాన్ని కనబరిచారు. గవర్నర్ ఏం చేసినా తమకోసమే అన్న భావన ఆర్టీసీ ఉద్యోగుల్లో కనపడింది. అప్పట్నుంచి నిర్ణయం వెలువడేవరకు ఈ బిల్లు పట్ల ఎలాంటి అనుమానాలు ఉద్యోగుల్లో కనపడలేదని చెప్పుకుంటారు.
యూనియన్ల సంతోషం
ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదించడం పట్ల అన్ని యూనియన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ సిబ్బంది గవర్నర్ కు రుణపడి ఉంటారని ఆర్టీసీ JAC ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ SWF తరఫున జనరల్ సెక్రటరీ వి.ఎస్.రావు.. గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయన్న ఆయన.. వివిధ అంశాలపై కార్మిక సంఘాలతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ వెలువరించాలని సంఘాలన్నీ కోరుతున్నాయి.