ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే దసరా నుంచి అల్పాహార(టిఫిన్) పథకం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ స్కీమ్ అమలు చేయనుంది. ఇందుకోసం ఏటా రూ.400 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. అక్టోబరు 24 నుంచి ఈ అల్పాహార పథకం అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ‘సీఎం అల్పాహార పథకం’ అమలు చేయనున్నారు. తమిళనాడులో ఇప్పటికే ఈ పథకం అమలవుతున్నది. అక్కడికి వెళ్లి వచ్చిన మన రాష్ట్ర బృందం.. ఈ అల్పాహార పథకాన్ని పరిశీలించింది. అందుకు సంబంధించిన విధివిధానాలపై సర్కారుకు నివేదిక అందించడంతో… ఈ స్కీమ్ ను తెలంగాణలోనూ అమలు చేయాలని సర్కారు తీర్మానించింది.
అయితే తమిళనాడు రాష్ట్ర సర్కారు మాత్రం కేవలం ప్రాథమిక(Primary) విద్యాలయాల్లో మాత్రమే అల్పాహారం పెడుతున్నారు. కానీ ఇది ప్రైమరీకే పరిమితం చేస్తే ఉన్నత పాఠశాల(High Schools)ల్లో వేలాది మంది పిల్లలు పౌష్ఠికాహారం అందకుండా పోతుందని KCR ప్రభుత్వం భావించింది. అందుకు ఖర్చు ఎక్కువైనా భరించి అందరికీ అల్పాహారం అందించాలని నిర్ణయించింది.
గత కొన్నేళ్లుగా విద్యార్థులకు వారానికి మూడు రోజుల పాటు కోడిగుడ్లు అందించడంతోపాటు 2023 ఆగస్టు నుంచి రోజు విడిచి రోజు(Alternative Days) రాగి జావ అందిస్తున్నారు. ఒకరోజు గుడ్డు ఉంటే మరో రోజు జావ పెడుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు క్యాల్షియంతోపాటు పౌష్ఠికాహారం అందుతున్నది. అల్పహారం ఇవ్వాలన్న తాజా నిర్ణయంతో పేద కుటుంబాల పిల్లలకు మరోసారి మంచి భోజనం అందే అవకాశముంది.