కొవిడ్ కేసులతో రెండేళ్ల పాటు అన్ని వ్యవస్థలు అస్తవ్యస్థమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ టైమ్ లో.. మరో ప్రమాదకర వైరస్ దేశంలోని వైద్యశాఖ వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కేరళ రాష్ట్రంలో మరోసారి వెలుగుచూసిన ‘నిపా’ వైరస్ అక్కడ కలకలం సృష్టించింది. ఇప్పటికే దీని బారిన పడి ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురిలోనూ లక్షణాలు(Symptoms) వెలుగుచూశాయి. దీంతో వైరస్ బయటపడ్డ కోజికోడ్ లో అన్ని రకాల విద్యాసంస్థల(Educational Institutions)ను ఈ నెల 24 వరకు మూసివేయాలని కేరళ సర్కారు ఆదేశాలిచ్చింది. కోజికోడ్ కు చెందిన మహ్మదాలీ(47) గత నెల 30న ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన వైద్యారోగ్యశాఖ.. శాంపిల్స్ ని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించాయి. గొంతు ద్వారా వ్యాధి సోకినట్లు పుణె ల్యాబ్ శుక్రవారం నాడు(నిన్న) సర్టిఫై చేసి రిపోర్ట్ ను కేరళకు పంపింది. ‘నిపా’ వైరస్ కోణంలో పరీక్షలు చేయకుండానే ఆయనకు అంతకుముందు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు.
పుణె ల్యాబ్ రిపోర్ట్ తో ఆందోళన పడ్డ కేరళ అధికారులు.. మృతుడికి సంబంధించిన కుటుంబంలో టెస్ట్ లు చేస్తే ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. కోజికోడ్ కార్పొరేషన్ లిమిట్స్ లోని చెరువన్నూర్ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి సైతం నిన్న ‘నిపా’ నిర్ధారణైంది. ఈ నెల 15 వరకు కోజికోడ్ లో 6 కేసులు రికార్డు కాగా.. మళ్లీ కొత్త కేసులు వెలుగుచూడలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మందిలో లక్షణాలు బయటపడితే అందులో మలప్పురానికి చెందిన 22 మంది, వయనాడ్, కన్ననూర్, త్రిశూర్ కు చెందిన మిగతావారు ఉన్నారని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. ‘నిపా’ వైరస్ బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారు రాష్ట్రంలో 1,080 మంది ఉండగా.. ఒక శుక్రవారం నాడే 130 మందిని గుర్తించారు. మొత్తంగా 297 మంది ‘హై రిస్క్’లో ఉండగా.. అందులో 122 మంది హెల్త్ వర్కర్స్ ఉన్నట్లు మంత్రి తెలియజేశారు.
నిపా వైరస్ ఎలా వస్తుంది…!
గబ్బిలాల వల్ల వ్యాపించే నిపా వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స గానీ, టీకాలు లేకపోవడం ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. కొవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత డేంజరస్ అని వైద్య శాఖ వర్గాలు అంటున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం చెట్ల మీద పండ్లపై పడటం.. ఆ ఫ్రూట్స్(Fruits) రసాల్ని తాగడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు తేల్చారు. ఒకరి స్రావాల ద్వారా మరొకరికి వ్యాపించే ఈ వ్యాధి.. కేరళలో మళ్లీ వెలుగుచూసిందన్న వార్త సంచలనం కలిగించింది. నోరు, ముక్కు, రక్తం, మూత్రం నుంచి వచ్చే స్రావాల్లో ఇది ఉంటుందని చెబుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్ కలిగినవారికి ఈ వైరస్ త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. నిపా వైరస్ ను తొలిసారి 1999లో మలేషియాలో గుర్తించారు.