మా నీళ్లు మాకిస్తే చాలు.. ఆంధ్రా నీళ్లు వద్దే వద్దు అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మన నీళ్లు దక్కాలన్న ఉద్దేశంతో ఎక్కడా భూములు కోల్పోకుండా గుట్టల్లో రిజర్వాయర్లు కట్టుకున్నాం అని తెలిపారు. కృష్ణానది వాటాను ఇప్పటికైనా తేల్చి తెలంగాణకు వచ్చే నీళ్లు ఇవ్వాలంటూ BJPపై హాట్ కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. తొలి పంప్ స్విచ్ ఆన్ చేసి నీటిని ఎత్తిపోయడం ద్వారా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రోజుకు 2 టీఎంసీల శ్రీశైలం వెనుకజలాలు తరలించేలా ఈ ప్రాజెక్టు తయారు కాగా.. ప్రారంభోత్సవంలో భాగంగా కృష్ణమ్మకు CM ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ వస్తేనే సకల దరిద్రాలు పోతాయని గతంలోనే చెప్పానని, అనుకున్నట్లుగానే ఆ విధంగానే ముందుకు సాగుతున్నామన్నారు.
‘ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టిన ఘనుడు చంద్రబాబునాయుడు కాదా.. తెలంగాణ ఇంకా బాగా కావాల.. ఇద్దరు ముగ్గురు BJP పోరగాండ్లు నా బస్సుకు అడ్డం వచ్చిండ్రు.. సిగ్గుందా అలా రావడానికి.. కృష్ణా వాటా తేల్చకుండా అడ్డుపడుతున్న BJP లీడర్లు, కార్యకర్తల్ని తరిమి తరిమి కొట్టాలి’ అని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ MPగానే తాను తెలంగాణ సాధించిన కీర్తి.. జిల్లాకు శాశ్వతంగా ఉండిపోతుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.