5 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన జట్టు పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకొక్కటి ఓడిపోతే అంతకన్నా మించిన ఓటమి ఉండదు. కానీ గెలవాలన్న కసి ఉంటే ఏదైనా చేయవచ్చని ఆతిథ్య సౌతాఫ్రికా నిరూపించింది. సొంతగడ్డపై ఆదిలోనే జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మరీ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత భారీ స్కోర్లు చేయడం, తర్వాత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడం వల్లే వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గింది. జోహెన్నెస్ బర్గ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 రన్స్ చేసింది. అనంతరం ఆసీస్ ను 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ చేసి 3-2 తేడాతో ట్రోఫీని దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించకున్నా నిలకడగా ఆడారు. ఎయిడెన్ మార్ క్రమ్(93; 87 బంతుల్లో, 9×4, 3×6) ధనాధన్ బ్యాటింగ్ తో ఆ జట్టు 300 స్కోరు దాటింది. చివరి మూడు మ్యాచ్ ల్లోనూ బవుమా సేన 300 మార్క్ ను దాటి భారీ స్కోర్లు చేసింది. డేవిడ్ మిల్లర్ కూడా హాప్ సెంచరీ(63; 65 బంతుల్లో, 4×4, 3×6)తో రాణించాడు. మార్కో జాన్సెన్(47), ఫెలుక్వాయో(38 నాటౌట్), వాన్ డెర్ డసెన్(30) తలో చేయి వేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, అబాట్ 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారూ జట్టులో.. ఓపెనర్ మిచెల్ మార్ష్(71) మాత్రమే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. లబుషేన్(44) మినహా ఎవరూ సరిగా ఆడలేదు. మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్ ధాటికి కంగారూ జట్టు పూర్తి కంగారులో పడిపోయింది. 5 వికెట్లతో జాన్సన్, 4 వికెట్లతో మహరాజ్.. ఆస్ట్రేలియాను బెంబేలెత్తించారు. 5 వికెట్లు తీసిన మార్కో జాన్సన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఎయిడెన్ మార్ క్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.