
అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక విషయం వెల్లడించారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు చర్చకు వస్తాయని తెలిపారు. 2047 కల్లా కచ్చితంగా మనది అభివృద్ధి చెందిన దేశం(Developed Country) అని మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. కాసేపట్లో ఆయన లోక్ సభలో ప్రసంగించనుండగా.. అంతకుముందే పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. జీ20 సదస్సు అద్భుతంగా జరిగిందని, అది భారత ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశానికి ఎనలేని పేరు, ప్రఖ్యాతులు వచ్చాయని.. కొత్త సంకల్పం దిశగా వేసే అడుగులు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటున్నానని ప్రధాని అన్నారు. మరికొద్దిసేపట్లోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి.
ఈ నెల 22 వరకు 5 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తున్నది. పార్లమెంటు 75 సంవత్సరాల ప్రస్థానంపై చర్చనే మెయిన్ అజెండాగా ఉంటుందని ఇప్పటిదాకా NDA నేతలు చెబుతూ వచ్చారు. కానీ మోదీ తాజా ప్రకటనతో ఈ మీటింగ్స్ లో చారిత్రక నిర్ణయాలు ఉండబోతున్నాయనే దానిపై క్లారిటీ వచ్చింది. జమిలి ఎన్నికలే ప్రధాన చర్చకు కారణమవుతాయా అన్నది తెలియాల్సి ఉంది. మొదటి రోజు సమావేశాలు పార్లమెంటు పాత భవనంలోనే జరగనుండగా… ఈ నెల 19 నుంచి కొత్త బిల్డింగ్ కు మారుస్తారు. ఆ రోజు కేవలం ఫొటో సెషన్ మాత్రమే నిర్వహించి 20వ తేదీ నుంచి మీటింగ్స్ కొత్త బిల్డింగ్ లో మొదలు పెట్టనున్నారు.