ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అని చెప్పుకునే మన దేశంలో మహిళలకు ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు. సాక్షాత్తూ చట్టాలు చేసే చట్ట సభల్లోనే వారికి సమన్యాయం జరగడం లేదు. కానీ ఇక నుంచి ఆ సమస్య ఉండబోదని కేంద్ర ప్రభుత్వం(Union Government) క్లారిటీ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు ఫస్ట్ డే సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్.. రెండు గంటలకు పైగా కొనసాగింది. ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ మంత్రులంతా తీర్మానం చేశారు. చట్టసభల్లో ఇక నుంచి 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.
అతి తక్కువ మందికే ఛాన్స్
పార్లమెంటు ఉభయ సభల(Loksabha, Rajyasabha)కు ఇప్పటిదాకా 7,500 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన అన్ని ఎన్నికలకు కలిపి ఇప్పటివరకు ఈ స్థాయిలో MPలు పనిచేశారు. కానీ ఇందులో మహిళల సంఖ్య కేవలం 600 మాత్రమే. అంటే 7,500 మందిలో ఇప్పటిదాకా రెండు సభలకు ఎలక్ట్ అయింది 600 కాగా.. వారి శాతం కేవలం 8 మాత్రంగానే ఉంది. కానీ మోదీ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయంతో మహిళల హక్కులు మరింత పెరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే పార్లమెంటుతోపాటు రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్లలో కచ్చితంగా రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన బిల్లుపై మంత్రి ప్రహ్లాద్ సింగ్ జోషి.. ఆనందాన్ని పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును నెరవేర్చే ధైర్యం మోదీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
దశాబ్దాల డిమాండ్ సాకారం
మహిళా రిజర్వేషన్ బిల్లు గత కొన్ని సంవత్సరాలుగా అందరి నోళ్లలో నానుతూనే ఉంది. పార్లమెంటు సెషన్స్ ఏర్పాటు చేసే ప్రతి సందర్భంలోనూ ఈ అంశం ప్రధాన చర్చకు వస్తుంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. కానీ ప్రస్తుత స్పెషల్ సెషన్స్ లోనే ఈ బిల్లు పెట్టనుండటంతో ఉమెన్ ప్రాతినిధ్యం నాలుగు రెట్లు పెరగడంతోపాటు వారికి సరైన గౌరవం దక్కనుంది. 5 రోజుల పాటు సాగే స్పెషల్ సెషన్స్ లో కీలక నిర్ణయాలు ఉంటాయని మీటింగ్స్ స్టార్ట్ అవకముందే మోదీ ప్రకటించారు. బిల్లును ఇప్పుడు కేబినెట్ ఆమోదించడంతో మహిళలు మోదీ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.