కన్న కూతురి మరణం ఆ సినీ హీరోని తట్టుకోలేకుండా చేసింది. కూతురు అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘బిడ్డ లేని లోకంలో నేనూ లేను’ అంటూ తమిళ హీరో విజయ్ అంటోనీ భావోద్వేగంతో కూడిన పోస్ట్(Emotional Post)ను పెట్టారు. విజయ్ కూతురు మీరా మూడు రోజుల క్రితం ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ‘నా కుమార్తె మీరా.. ప్రేమ గల, ధైర్యవంతురాలైన అమ్మాయి.. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని నిశ్శబ్ద ప్రదేశానికి చేరుకుంది… ఆమె ఇంకా నాతో మాట్లాడుతూనే ఉంది.. నేను ఆమెతోపాటే చనిపోయా… నేను ఇప్పుడు ఆమె కోసమే టైమ్ స్పెండ్ చేస్తున్నా.. ఇప్పుడు నా బిడ్డ తరఫున మంచి పనులు చేస్తాను.. ఆమె వాటిని కిక్ స్టార్ట్ చేస్తుంది’ అన్నది పోస్ట్ సారాంశం. తన బాధను తెలియజేస్తూ ‘X'(పాత ట్విటర్)లో పోస్ట్ చేసిన మెసేజ్.. ఆయన పడుతున్న ఆవేదనకు అద్దం పట్టింది.
వేదనతో అభిమానుల రీట్వీట్
‘నా కుమార్తెతోపాటు నేనూ చచ్చిపోయా.. ఇప్పుడు రోజూ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నా.. అన్న పోస్ట్ పై అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. హీరో విజయ్ కు ఓదార్పుగా సంతాపంతో కూడిన మెసేజ్ లను పోస్ట్ చేశారు. ఈ నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు.. స్ట్రాంగ్ గా ఉండండి విజయ్ అన్నా.. మీ ఆవేదన హృదయాన్ని కలచివేస్తున్నది.. చదవడానికి బాధగా ఉంది, నువ్వు పడుతున్న వేదనను ఊహించలేను.. అంటూ చాలా మంది పోస్ట్ లు పెట్టారు. విజయ్ ఆంటోనీ-ఫాతిమా పెద్ద కుమార్తె మీరా ఈ నెల 19న తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. 16 ఏళ్ల మీరా చెన్నైలోని ఆల్వార్ పేటలోని తన ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో విజయ్ కుటుంబంలో తీరని దుఃఖం నిండింది. బిచ్చగాడు పార్ట్-1, 2తో ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. అలాంటి యాక్టర్ ఇప్పుడు ఇలాంటి భావోద్వేగ పోస్ట్ పెట్టడం అందరినీ కలచివేసింది.