Published 22 Sep 2023
వచ్చే ఎన్నికల కోసం టికెట్లు ప్రకటించే టైమ్ దగ్గర పడుతుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ కనిపించడం ఒకెత్తయితే… ఫలానా వ్యక్తులకు టికెట్లు ఇవ్వొద్దంటూ పోస్టర్లు వెలుస్తుండటం మరో ఎత్తుగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్ గోడలపై పోస్టర్లు అతికిస్తూ హంగామా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మధుయాష్కీని వ్యతిరేకిస్తూ ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. ఎల్బీనగర్ నుంచి ఆయన పోటీ చేసేందుకు అప్లయ్ చేసుకోగానే వ్యతిరేకవర్గం ఈ పోస్టర్లను అంటించింది. ఇప్పుడు కూకట్ పల్లి టికెట్ ను గొట్టిముక్కల పద్మారావుకు ఇవ్వొద్దంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు పెద్దయెత్తున వెలిశాయి. పద్మారావు వ్యక్తిగత, రాజకీయ చరిత్ర బాగా లేదని, అలాంటి వారికి టికెట్ కేటాయిస్తే పార్టీకే నష్టమని ఆ పోస్టర్లలో ప్రింట్ అయి ఉంది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుడంటూ సాగుతున్న ప్రచారంతో టికెట్ ను పరిగణలోకి తీసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ పద్మారావుకు టికెట్ ఇవ్వొదంంటూ అందులో పేర్కొన్నారు. ఇట్లు మీ కాంగ్రెస్ కార్యకర్త అని ముగించారు. ఇలా రోజురోజుకూ హస్తం పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతూనే ఉన్నారు. ఎదుటి వర్గం లోపాల్ని ఎత్తిచూపుతూ తమ నాయకుడికే టికెట్ కేటాయించాలంటూ గాంధీభవన్ వద్ద హంగామా చేస్తున్నారు.