కుటిల నీతికి నిదర్శనంగా నిలిచే చైనా మరోసారి తన నైజాన్ని చాటుకుంది. మన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకుని కపట బుద్ధిని చూపించిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరోసారి తన అక్కసును చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులు తమ దేశంలోకి రాకుండా ‘నో ఎంట్రీ’ చెప్పింది. ఆసియా క్రీడల్లో(Asian Games) భాగంగా నిబంధనల ప్రకారం భారత్ ఆటగాళ్లు చైనాలో పర్యటించాల్సి ఉంది. రేపటి(సెప్టెంబరు 23) నుంచి ఆసియా క్రీడలు పొరుగు దేశంలోని హాంగ్జౌ నగరంలో మొదలవుతాయి. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే అరుణాచల్ ప్లేయర్లకు వీసాను రిజెక్ట్ చేసింది. ఈశాన్య రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ‘నో ఎంట్రీ’ చెప్పిన విషయాన్ని భారతదేశానికి తెలియజేసింది. ఈ విషయంలో చైనా తమకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మన దేశ అధికారులు తెలియజేశారు.
తీవ్రంగా స్పందించిన భారత్
అరుణాచల్ ప్రదేశ్ ప్లేయర్లకు పర్మిషన్ లేకపోవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. క్రీడా నిబంధనలు, క్రీడోత్సవాల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించిందంటూ ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఈ ఆసియా గేమ్స్ కోసం చైనా వెళ్లాల్సి ఉంది. కానీ చైనా తీరుతో ఆయన తన టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.