
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ A29గా కేసు ఫైల్ అయిన సినీ కథానాయకుడు నవదీప్.. పోలీసుల ఎదుట అటెండ్ అయ్యారు. డ్రగ్స్ సప్లయర్ రాంచందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలోనే నవదీప్ కు నోటీసులు జారీ కాగా.. ఆ నవదీప్ నేను కాదు అంటూ బుకాయించారు. కొద్దిరోజులు కనిపించకుండా పోయిన ఈ నటుడు చివరకు కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ గడువు ముగియడంతో పోలీసుల ఎదుట నవదీప్ హాజరుకాక తప్పలేదు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు డ్రగ్స్ కేసులు వెలుగుచూసినా అందులో ఇతడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అదే మాదిరిగా ఈసారి సైతం ఆయన్ను విచారణకు రావాలంటూ రెండు రోజుల క్రితం 41A కింద నోటీసులు ఇష్యూ చేశారు.
నార్కోటిక్ పోలీసుల ఎదుట
సినీ హీరో నవదీప్.. విచారణలో భాగంగా నార్కోటిక్ పోలీసుల టీమ్ ఎదుట అటెండ్ అయ్యారు. ఈయన కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్ లను పూర్తిస్థాయిలో పరిశీలించిన పోలీసులు.. లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని నిజాల్ని వెలుగులోకి తెచ్చే అవకాశముంది. సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డితోపాటు మురళి, బాలాజీ అనే వ్యక్తుల్ని తొలుత అరెస్టు చేశారు. ఆగస్టు 31న హైదరాబాద్ మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ లో వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురు అందించిన ఇన్ఫర్మేషన్ మేరకు ముగ్గురు నైజీరియన్లతోపాటు మొత్తం 8 మందిని పట్టుకున్నారు. ఈ కేసులో టోటల్ గా 18 మంది ఉన్నట్లు గుర్తించగా.. 11 మందిని రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు నవదీప్ పై సాగించే విచారణతో మరిన్ని పేర్లు బయటకు వస్తాయో లేదో చూడాలి.