
TSPSC తీరును తప్పుబడుతూ గ్రూప్-1 పరీక్షను సింగిల్ బెంచ్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో వేసిన పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. కమిషన్ తీరుపై నిన్ననే అసహనం, ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. గ్రూప్-1 ఎగ్జామ్ ను రద్దు చేస్తూ ఈ నెల 24న హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ ఈ నెల 25న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. 26 నాడు విచారణ చేపడతామని కోర్టు తెలియజేసింది. దీంతో అనుకున్నట్లుగానే మంగళవారం నాడు డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు కొనసాగాయి. TSPSC తీరుపై డివిజన్ బెంచ్ సైతం అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది.
నోటిఫికేషన్ లో తెలిపినట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కోర్టు… దాని వల్ల కలిగే ఇబ్బందులేంటో చెప్పాలని ప్రశ్నించింది. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ నే అమలు చేయలేకపోతే ఇక ఎందుకు అని నిలదీసింది. ఒకసారి ఎగ్జామ్ రద్దయ్యాక అయినా జాగ్రత్తగా ఉండాలి కదా.. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత TSPSCకు ఉంది అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అభ్యర్థుల భవిష్యత్తుతోపాటు TSPSC ప్రతిష్ఠ క్వశ్చన్ మార్క్ గా తయారైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్(AG)ని ఆదేశించింది.