భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనాల(Ganesh Immersion) కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. గురువారం(రేపు) పొద్దున్నుంచి ఎల్లుండి ఉదయం వరకు పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నిమజ్జనాలు జరిగే ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. GHMC పరిధిలో 40 వేల మందితో బందోబస్తు మోహరిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర పారామిలిటరీ బలగాల్ని రంగంలోకి దింపుతున్నారు. శోభాయాత్ర కోసం వచ్చే వెహికిల్స్ ను నెక్లెస్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్క్ వరకు పార్క్ చేయాల్సి ఉంటుంది. గురువారం పొద్దున్నుంచి శుక్రవారం రాత్రి వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. ప్రతి గణేశ్ విగ్రహానికి ఒక కానిస్టేబుల్ లేదా హోంగార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తును మోహరిస్తున్నారు. మొత్తంగా 5,000 సీసీ కెమెరాలతో హైదరాబాద్ ను నిఘా నీడలో ఉంచుతున్నారు. అన్ని శాఖల అధికారులు ఇన్వాల్వ్ అయ్యేలా ఉమ్మడి శాఖలతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి గైడ్ చేయనున్నారు. మరోవైపు భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సైతం ఏర్పాట్లలో తలమునకలైంది.
అర్థరాత్రికి ఖైరతాబాద్ గణేశుడి ఏర్పాట్లు
లక్షలాది మంది దర్శించుకున్న ఖైరతాబాద్ గణేశుడు.. నిమజ్జనానికి తరలనున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత ప్రారంభించనున్నారు. రేపు ఖైరతాబాద్ గణనాథుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు. ఇందుకు సంబంధించి ఖైరతాబాద్ తోపాటు నిమజ్జనం జరిగే ప్రాంతం దాకా అడుగడుగునా పోలీసు నిఘా కొనసాగనుంది. ఈసారి ఖైరతాబాద్ గణేశుణ్ని లక్షల సంఖ్యలో దర్శించుకున్నారు. ఒకే రోజు 5 లక్షల మందికి పైగా దర్శనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.